బాబోయ్ కుక్కలు .. నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల స్వైరవిహారం

బాబోయ్  కుక్కలు .. నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల స్వైరవిహారం
  • గల్లీలో అడుగు పెడితే ఎగబడుతున్న స్ట్రీట్ డాగ్స్​ 
  • ప్రతినెలా పెరుగుతున్న డాగ్ బైట్ కేసులు
  • ఎండల తీవ్రతకు తోడు నీళ్లు, ఆహారం దొరక్క కోపంతో అటాక్​   
  • నామ్​కేవాస్తేగా ఏబీసీ సెంటర్​

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో స్ట్రీట్​ డాగ్స్​ బెడద రోజురోజుకూ ఎక్కువవుతున్నది. ఏ వీధికెళ్లినా జనం బెంబేలెత్తుతున్నారు. ఇంటి నుంచి బయట అడుగుపెడితే క్షేమంగా వెళ్లివస్తామన్న భరోసా కరువైంది. ఏ మూల నుంచి వచ్చి దాడి చేస్తాయోనని జంకుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేసి దారుణంగా గాయపరిచిన ఘటనలు ఉన్నాయి. మామూలు రోజుల్లోనే వీధి కుక్కలు ప్రజలకు దడ పుట్టిస్తుండగా సమ్మర్ టైంలో మరీ భయంతో వణికించేస్తున్నాయి. ఎండల తీవ్రతకుతోడుగా తాగునీరు, ఆహారం దొరకక పిచ్చెక్కి కనపడినవారినల్లా కరిచేస్తున్నాయి.   

జాడలేని వాటర్ టబ్స్​

ఏడాది క్రితం నిర్వహించిన గణనలో ఇందూర్, బోధన్, ఆర్మూర్, భీంగల్ టౌన్​లలో వీధి కుక్కుల సంఖ్య  40 వేలు ఉన్నట్లు తేలింది. 545 గ్రామ పంచాయతీల పరిధిలో 60 వేల కుక్కలతో కలిపి మొత్తం లక్ష డాగ్స్​ఉన్నాయని స్థానిక అధికారులు లెక్కలు వేశారు. మూగ జీవాల సంరక్షణ చట్టం ప్రకారం వాటిని చంపడానికి వీలులేదు. వాటి సంతతి పెరుగకుండా నియంత్రించాల్సి ఉంది. కుక్కల సంచారం అధికంగా ఉన్న ఏరియాల నుంచి ప్రజల ఫిర్యాదులను బట్టి మున్సిపాలిటీ/ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని పట్టుకెళ్లి సంతతి పెరుగకుండా ఏబీసీ (యానిమల్​ బర్త్​ కంట్రోల్​) సెంటర్​లో ఆపరేషన్లు చేయించాలి. ఇందుకు ప్రతి కుక్కకు సుమారు రూ.600 ఖర్చవుతుంది.

 నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఏకైక ఏబీసీ సెంటర్​కు ఫండ్స్ సమకూర్చకపోవడంతో అది నామ్​కేవాస్తేగా మారింది.  డాగ్​బైట్​ఇన్సిడెంట్లు పెరిగినప్పుడు నాలుగు రోజులు హడావిడి చేసి తరువాత కూల్ అవుతున్నారు. ఈ విషయంలో వెటర్నరీ డాక్టర్ల సేవలు వినియోగించుకోవడంలేదనే విమర్శలు లోకల్ బాడీ సంస్దలపై ఉన్నాయి. ఏడాది క్రితం చేసిన వీధి కుక్కల గణనను పరిశీలిస్తే ఇప్పటికీ వాటి సంఖ్య కచ్చితంగా పెరిగింది. కుక్కలకు ఆహారం సంగతి అటుంచితే తాగడానికి కనీసం నీరు దొరకడంలేదు. వాటర్​ టబ్స్​ ఏర్పాటును మున్సిపాలిటీలు, పంచాయతీలు మరిచిపోయాయి. దీంతో నీరసించిపోతున్న కుక్కలు కనబడిన వారిపై  దాడులు చేస్తూ కొన్నిసార్లు ఘోరంగా గాయపరుస్తున్నాయి. 

ఇంజెక్షన్లకు డిమాండ్..​

ఎండలు పెరిగాక జిల్లాలో డాగ్​బైట్ కేసులు బాగా పెరిగాయి. ఫిబ్రవరిలో 713 మంది కుక్కకాటుకు ఇంజెక్షన్​లు తీసుకోగా, మార్చి నెల 970 మంది, ఏప్రిల్​లో 1001 మంది తీసుకున్నారు. మే నెలలో ఇప్పటి వరకు 650 మంది డాగ్​బైట్​కు గురికాగా, అందులో పదేండ్లలోపు చిన్నారులు వంద దాకా ఉన్నారు. నగరంలో ఇంటి బయట ఆడుకుంటున్న మూడేండ్ల అంజలి ముఖాన్ని ఈనెల 14న వీధికుక్క కొరికి గాయపర్చగా 5 డివిజన్​లోని గాజుల్​పేట్, బడా రామ్​మందిరం ఏరియాలో అదే రోజు 15 మందిని కుక్క కరిచింది. నవీపేటకు చెందిన రేణుక అనే ఏడేండ్ల బాలిక, ఆర్మూర్ టౌన్​లో ఆరేండ్ల  హంసిని తీవ్రంగా గాయపడ్డారు. వీధి కుక్కల సంచారంపై ఫిర్యాదులు చేయడానికి నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన డాగ్ మినాస్ రూమ్​ ఎప్పుడు చూసినా క్లోజ్ ఉంటుంది. అక్కడి లాండ్​ లైన్​ ఫోన్ నంబర్​ పనిచేయడంలేదు.