కేయూలో రెండోరోజూ విద్యార్థుల ఆందోళన .. అడ్మినిస్ట్రేషన్​బిల్డింగ్ వద్ద ఉద్రికత్త

కేయూలో రెండోరోజూ విద్యార్థుల ఆందోళన .. అడ్మినిస్ట్రేషన్​బిల్డింగ్ వద్ద ఉద్రికత్త
  • అడ్డుకున్న పోలీసులు.. అడ్మినిస్ట్రేషన్​బిల్డింగ్ వద్ద ఉద్రికత్త 
  • షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ కండక్ట్ చేసిన వర్సిటీ ఆఫీసర్లు

హనుమకొండ/హసన్​ పర్తి, వెలుగు: కాకతీయ వర్సిటీలో పీజీ ఫోర్త్​ సెమిస్టర్ ఎగ్జామ్స్​ వాయిదా వేయాలని విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆందోళన నిర్వహించి.. మంగళవారం ఉదయం అడ్మినిస్ట్రేషన్​బిల్డింగ్​ఎదుట బైఠాయించారు. దీంతో కేయూ, హనుమకొండ పోలీసులు భారీగా మోహరించారు. వీసీ స్పందించాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేయగా  వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఓ విద్యార్థిని చేయికి గాయమైంది. అనంతరం పలువురు స్టూడెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని కేయూ స్టేషన్​ కు తరలించారు. 

దీంతో వర్సిటీ వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది.  పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. మంగళవారం నుంచి ఈనెల 31వ వరకు పీజీ ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహణకు వర్సిటీ అధికారులు షెడ్యూల్ ఇచ్చారన్నారు. కానీ, జూన్​1న బీఎడ్, 5న ఎన్టీపీసీ, 15న టెట్, 21న నెట్, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయని, దీంతో సెమిస్టర్​పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా కోరామన్నారు. వర్సిటీ అధికారులు ఇష్టారీతిన షెడ్యూల్​లో మార్పులు చేసి, ముందస్తుగా ఎగ్జామ్స్​నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆఫీసర్లు

పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తుండగా, మరోవైపు ఆఫీసర్లు పరీక్ష నిర్వహించారు. వచ్చే అకాడమిక్ ఇయర్ పై ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. మంగళవారం పీజీ ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కేయూ ఎగ్జామినేషన్స్​కంట్రోలర్ ప్రొ.కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్​ జిల్లాల్లో దాదాపు 95 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు.