ఈ టీచర్ మాకొద్దు అంటూ విద్యార్థుల రాస్తారోకో

ఈ టీచర్ మాకొద్దు అంటూ విద్యార్థుల రాస్తారోకో

చిట్యాల, వెలుగు : పాఠాలు చెప్పాల్సిన టీచర్ సొంత పనులు చేయించుకుంటూ వేధింస్తుండడంతో స్టూడెంట్స్ అందరూ కలిసి రోడ్డెక్కారు. ‘ఈ టీచర్ మాకొద్దు’ అంటూ రాస్తారోకో చేశారు. విద్యార్థుల కథనం ప్రకారం..జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ హైస్కూల్ లో సోషల్ టీచర్.. ​స్టూడెంట్స్​ను ఇంటికి తీసుకువెళ్లి  బట్టలు ఉతికించడంతో పాటు టీ కప్పులు కడిగిస్తోంది. ఇంటి పనులన్నీ చేయాలని ఇబ్బందులకు గురి చేస్తోంది. చెప్పిన మాట వినకపోతే మార్కులు తక్కువ వేయడంతో పాటు కొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఇదివరకు ఒకసారి టీచర్ ను మందలించినా పద్ధతి మార్చుకోలేదు. ఈ వేధింపులు భరించలేని పిల్లలు మంగళవారం ఆందోళనకు దిగారు. స్కూల్ ముందున్న మెయిన్ ​రోడ్డుపై ప్లకార్డులతో బైఠాయించారు. టీచర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ ​చేశారు. రెండు గంటలు ధర్నా చేసిన తర్వాత హెచ్ఎం చంద్రశేఖర్ జోక్యం చేసుకుని టీచర్ పై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

అడిషనల్ కలెక్టర్ సీరియస్..

హైస్కూల్ ముందు స్టూడెంట్స్ ధర్నా చేసిన విషయాన్ని తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ దివాకర్.. ​హెచ్ఎం, సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు నలుగురు పిల్లలను పిలిపించుకుని మాట్లాడారు. వివరాలు కనుక్కుని పిల్లలను ఇబ్బందులకు గురిచేసిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.