చెరుకుకు మద్దతు ధర ప్రకటించాలి : సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సంగీత

చెరుకుకు మద్దతు ధర ప్రకటించాలి : సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సంగీత

మెదక్​/సంగారెడ్డి, వెలుగు: చెరుకు రైతులకు గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధర నిర్ణయించి రెండు, మూడు రోజుల్లో ప్రకటించాలని సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సంగీత షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌లో షుగర్ ఫ్యాక్టరీల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, చెరుకు రైతులతో ఆమె సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధి, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సహేతుకమైన ధర నిర్ణయించాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగేలా చెరుకు మద్దతు ధరతో పాటు రవాణా చార్జీలను రెండు, మూడు రోజుల్లో ప్రకటించాలని ఆదేశించారు. రైతులు మాట్లాడుతూ ఎల్‌‌‌‌నినో ప్రభావంతో సాగు ఖర్చులు పెరిగి, దిగుబడులు తగ్గాయని తెలిపారు.

చెరుకు టన్నుకు కనీసం రూ.5 వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎరువులు, డీజిల్, చెరుకు నరికే కూలీలు, రవాణా ఖర్చులు పెరిగినందున అందుకు అనుగుణంగా ధర నిర్ణయించాలని కోరారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో చెరుకుకు మెరుగైన ధర లభిస్తోందని, అక్కడి ఫ్యాక్టరీలకు చెరుకు సరఫరా చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంగారెడ్డి సీడీసీ చైర్మన్, రాష్ట్ర చెరుకు పరిశ్రమల పునరుద్ధరణ కమిటీ సభ్యుడు రాంరెడ్డి, రాయికోడ్ సీడీసీ చైర్మన్ ఎం.డి.మోబిన్, రైతు ప్రతినిధులు నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, మాధవరెడ్డి, నాజర్, మల్లారెడ్డి, చందర్ పాల్గొన్నారు.