(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) గుజరాత్ టైటాన్స్‌తో కలిసి 2022లో ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్జీ). జీటీ తన తొలి ప్రయత్నంలోనే టైటిల్ ముద్దాడి.. తర్వాతి ఏడాది ఫైనల్ చేరి ఔరా అనిపించింది. కానీ, లక్నో మాత్రం ఆడిన నాలుగు సీజన్లలో ఒక్కసారి కూడా ఫైనల్ కూడా చేరలేకపోయింది. రెండుసార్లు ప్లే ఆఫ్స్ వరకూ వచ్చిన ఆ టీమ్ గత రెండు సీజన్లలో మాత్రం ఏడో స్థానంతో నిరాశపరిచింది. ఈ సీజన్‌లో అయినా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలగా ఉంది. రూ. 27 కోట్ల రికార్డు ధర పలికిన రిషబ్ పంత్ సారథ్యంలో లక్నో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పంత్ కెప్టెన్సీ నైపుణ్యంతో పాటు, జట్టులోని ఇతర స్టార్ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- బలాలు
లక్నో జట్టుకు ఫారిన్ బ్యాటర్లే ప్రధాన ఆయుధాలు. ఐడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, జోష్ ఇంగ్లిస్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్ విభాగం కళకళలాడుతోంది. గత సీజన్‌లో మార్ష్, పూరన్, మార్‌క్రమ్ అద్భుతమైన ఫామ్ కనబరిచారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో మార్‌క్రమ్ మెరుపులు మెరిపించడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఆయుష్ బదోనీ, అర్షిన్ కులకర్ణి వంటి యంగ్ క్రికెటర్లు కూడా తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ తొలి దశలో హోమ్ గ్రౌండ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుండటం లక్నోకు అదనపు ప్రయోజనం కానుంది.
- బలహీనతలు
గాయాల బారిన పడే అవకాశం ఉన్న బౌలింగ్ విభాగమే లక్నోకు అతిపెద్ద బలహీనత. మహ్మద్ షమీ, మయాంక్ యాదవ్, అన్రిచ్ నార్జ్, అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్ వంటి ప్రధాన బౌలర్లు తరచూ ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వానిందు హసరంగ అందుబాటుపై కూడా స్పష్టత లేదు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ గత సీజన్‌లో తన రేటుకు తగ్గట్టుగా రాణించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జట్టులో అనుభవజ్ఞులైన ఇండియన్ బ్యాటర్ల కొరత ఉండటంతో పంత్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. లక్నో పిచ్‌లు భారీ స్కోర్లకు నిలయంగా మారుతుండటంతో, షమీ, నార్జ్ వంటి సీనియర్లు ధారాళంగా రన్స్ ఇచ్చుకుంటే మాత్రం జట్టుకు కష్టాలు తప్పవు.
బెస్ట్ పెర్ఫామెన్స్ 2022, 23లో మూడో ప్లేస్
లక్నో సూపర్ జెయింట్స్ టీమ్:
రిషబ్ పంత్ (కెప్టెన్), ఐడెన్ మార్‌క్రమ్, హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, ముకుల్ చౌదరి, అక్షత్ రఘువంశీ, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, వానిందు హసరంగ, ఆయుష్ బదోనీ, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ఎం. సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, ఆకాశ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, అన్రిచ్ నార్జ్, నమన్ తివారీ, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్.
