ఆ 106 ఎకరాలు  అటవీ శాఖవే.. తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు

ఆ 106 ఎకరాలు  అటవీ శాఖవే.. తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు
  • జయశంకర్ భూపాలపల్లి భూముల వ్యవహారంపై విచారణ
  • రివ్యూ పిటిషన్ లో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని అసహనం

న్యూఢిల్లీ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కొంపల్లి శివారు భూములు అటవీ శాఖకే చెందుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సర్వే నంబర్ 171లో ఉన్న 106.34 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానివే అని 60 పేజీల తీర్పు కాపీలో పేర్కొంది. 106.34 ఎకరాల భూమి తనది అని 1985లో మహ్మద్ అబ్దుల్ ఖాసీం అనే వ్యక్తి వరంగల్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న జిల్లా కోర్టు, భూములు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కే చెందుతాయని 1994లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అబ్దుల్ ఖాసీం హైకోర్టుకు వెళ్లారు. సుదీర్ఘ వాదనల తర్వాత 2018లో ప్రభుత్వానికి సానుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై అబ్దుల్ ఖాసీం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఖాసీంకే భూమిపై హక్కు ఉందని 2021, మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ.. 2021లో రాష్ట్ర అటవీశాఖ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పిటిషన్ పై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్ వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 

అటవీశాఖ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది. 106 ఎకరాలు అటవీ శాఖకే చెందుతాయని గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 

హైకోర్టు తీరుపై సుప్రీం అసంతృప్తి

అబ్దుల్ ఖాసీం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని చెప్పింది. కనీసం తనదిగా నిరూపించుకోలేని వ్యక్తికి 106 ఎకరాల అటవీ భూమిని గిఫ్ట్​గా ఇవ్వడం ఏంటని ఆర్డర్ కాపీలో ప్రశ్నించింది. ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేలా అఫిడవిట్ ను దాఖలు చేసిన ఆఫీసర్లపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అటవీ, రెవెన్యూ శాఖల వేర్వేరు అఫిడవిట్లు

ఈ కేసు వ్యవహారంలో అటవీ, రెవెన్యూ శాఖలు వేర్వేరు అఫిడవిట్లు ఫైల్ చేయడంపై గతంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనల సందర్భంగా ఈ భూమి అటవీశాఖకే చెందుతుందని ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ వాదించగా.. ఇందుకు భిన్నంగా ఈ 106 ఎకరాలపై ప్రైవేట్ వ్యక్తికే హక్కు ఉందని రెవెన్యూ శాఖ అఫిడవిట్ ఫైల్ చేసింది. దీంతో ప్రభుత్వానికి చెందిన రెండు శాఖలు విభిన్న వాదనలు వినిపించడంతో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకే వాదన వినిపించాలని గత అక్టోబర్ లో సీఎస్ ను ఆదేశించింది. 106 ఎకరాల అటవీ భూమిగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటూ కొత్త అఫిడవిట్ ఫైల్ చేసి వాదనలు కొనసాగించింది.