Liquor Scam: సుప్రీంకోర్టులో సిసోడియాకు ఎదురుదెబ్బ

Liquor Scam: సుప్రీంకోర్టులో సిసోడియాకు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు చుక్కెదురైంది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దీనిపై తదుపరి విచారణకు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అవినీతి కిందకు వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.  దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనపై చేసిన ఆరోపణలతో  తనకు ఎలాంటి సంబంధం లేదని సిసోడియా సుప్రీంకోర్టుకు తెలిపారు.  ఈ కేసు విచారణపై స్టే ఇచ్చి..తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు దీనికి నిరాకరించింది.

మనీశ్  సిసోడియా పిటిషన్ పై  మంగళవారం మధ్యాహ్నం 3.50కి సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 30 నిమిషాల విచారణ తర్వాత  కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై తాము  తాము విచారణ చేయబోమని సిసోడియాకు సుప్రీంకోర్టు తేల్చి చెప్పి్ంది. ఈ కేసు అవినీతి కిందకు వస్తుంది కాబట్టి...ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే గతంలో వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిసోడియా తరఫు లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం... దానికి ఈ కేసుకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

మనీష్ సిసోడియాను  ఆదివారం అరెస్టు చేసిన సీబీఐ.. సోమవారం కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సీబీఐ కోర్టు సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. మనీష్ సిసోడియాను ఐపీసీ 120 బి, 477 ఎ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద అరెస్టు చేశారు.