మతమార్పిడిపై రాజకీయం వద్దు

మతమార్పిడిపై రాజకీయం వద్దు

న్యూఢిల్లీ: మత మార్పిడి అంశం చాలా సీరియస్ ఇష్యూ అని, దీనికి రాజకీయ రంగు పులమొద్దు అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మోసపూరిత మత మార్పిడులను అరికట్టి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్​ సి.టి రవికుమార్​తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అటార్నీ జ‌‌న‌‌ర‌‌ల్(ఏజీ) ఆర్ వెంక‌‌ట‌‌ర‌‌మ‌‌ణిని బెంచ్ సాయం కోరింది. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి? దిద్దుబాటు చర్యలు ఏంటో చెప్పాలని ఇద్దరు జడ్జిల బెంచ్ ఏజీని కోరింది. తమ రాష్ట్రంలో ఎలాంటి మతమార్పిళ్లు జరగలేదని, ఈ పిల్​ను రాజకీయ కక్షసాధింపు చర్యగానే చూడాలని తమిళనాడు తరఫు సీనియర్​ అడ్వకేట్ విల్సన్ కోర్టుకు విన్నవించారు. ఈ కామెంట్లపై సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ‘‘మీరు ఈ కామెంట్లు చేయడానికి వేరే కారణాలు ఉండొచ్చు. కోర్టు ప్రొసీడింగ్స్​ను ఇతర అంశాలతో ముడిపెట్టొద్దు. ఇది మీ రాష్ట్రంలో జరిగితే బాధాకరం.. జరగకపోతే మంచిదే.. కానీ, మేము దేశంకోసం ఆందోళన చెందుతున్నాం. దయచేసి ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు” అని సుప్రీం కోర్టు పేర్కొంది.

అలాంటి జిల్లా అంటూ లేదు..

తాజా పిటిషన్​పై తమ అభిప్రాయం చెప్పాలని సెప్టెంబర్​ 23న కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. అడ్వకేట్ అశ్వినీ కుమార్​ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్​ దాఖలు చేశారు. దేశంలో ‘హుక్ అండ్ క్రూక్’ ద్వారా మత మార్పిడిలేని జిల్లా ఒక్కటీ లేదని పిటిషన్​లో పేర్కొన్నారు.