
- తీర్పు సరిగా ఇవ్వనందుకు ఉత్తర్వులు
న్యూఢిల్లీ: ఓ కేసులో తీర్పు సరిగా ఇవ్వలేదని ఢిల్లీలోని సెషన్స్ కోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలకు సుప్రీం కోర్టు పెనాల్టీ విధించింది. ఇద్దరినీ ఏడు రోజులపాటు జ్యుడీషియల్ ట్రైనింగ్ తీస్కోవాలని ఆదేశించింది. ట్రైనింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సూచించింది. రూ.1.9 కోట్ల మోసం కేసులో సరైన ఎవిడెన్స్‌లు లేకుండానే సెషన్ కోర్టు జడ్జి, అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్.. నిందితులకు బెయిల్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇద్దరు జడ్జిలను ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీలో 7 రోజులపాటు తప్పనిసరిగా శిక్షణ తీస్కోవాలంది.
నెట్‌సిటీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన ఈ కేసులో నిందుతులైన శిక్షా రాథోడ్ దంపతులకు ఆ ఇద్దరు జడ్జిలు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. నిందితులిద్దరినీ రెండువారాల్లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు అధికారి పాత్రను కూడా సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చార్జిషీట్ దాఖలు చేసిన కేసులో నిందితుల కస్టోడియల్ ఇంటరాగేషన్ అక్కర్లేదని దర్యాప్తు అధికారి చెప్పడంపైనా మండిపడింది. దర్యాప్తు అధికారి తీరుపై విచారణ జరిపి చర్యలు తీస్కోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
కేసు ఏంటంటే..
పూచికత్తు కింద ల్యాండ్ పేపర్లు పెట్టి నెట్‌సిటీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి దంపతులు 2017లో 1.9 కోట్ల లోన్ తీస్కున్నారు. వారు ఆ లోన్ కట్టకపోగా, పూచికత్తుగా పెట్టిన భూమి అప్పటికే తాకట్టులో ఉందని, ఆపై మరొకరికి అమ్మేశారని తెలిసింది. దీంతో కంపెనీ ఫిర్యాదుతో కేసు కోర్టుకెక్కింది. నిందితులు ముందస్తు బెయిల్‌కు అప్పీల్ చేయగా సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఆపై ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఆర్డర్‌ను మంజూరు చేసింది. అనంతరం ఇరు పార్టీలు సెటిల్మెంట్ కోసం భేటీ కాగా, కంపెనీకి 6.25 కోట్లు చెల్లిస్తామని నిందితులు ఒప్పందం చేస్కుని ఒక్క రూపాయి కూడా కంపెనీకి కట్టలేదు.
దీంతో కంపెనీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. నిందితులు మరోసారి ముందస్తు బెయిల్ అప్పీల్ చేస్కోగా హైకోర్టు తిరస్కరించింది. అనంతరం ఈ కేసులో చార్జిషీట్ దాఖలైంది కాబట్టి కస్టోడియల్ విచారణ అక్కర్లేదని చెప్పిన దర్యాప్తు ఆఫీసర్ వాదనలతో మెట్రోపాలిటన్ కోర్టు ఏకీభవించి నిందితులకు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డర్‌ను సెషన్ కోర్టు సమర్థించింది. అంతకుముందు హైకోర్టులో కంపెనీవేసిన అప్పీల్‌ను కూడా సెషన్స్ కోర్టు కొట్టివేసింది.
ఇలా కేసు 2017 నుంచి ఆరేండ్లపాటు కొనసాగింది. అనంతరం ప్రైవేట్ కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. విచారణ జరిపిన జస్టిస్ అమానుల్లా.. సెషన్స్ కోర్టు, మెట్రోపాలిటన్ జడ్జిలు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్‌ను తప్పుపట్టారు.
ఈ కేసులో నిందితులు కంపెనీని ఎన్నోసార్లు మోసగించేందుకు ప్రయత్నించినప్పటికీ జడ్జిలు నిందితులకు అనుకూలంగా ఆర్డర్స్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీటితోపాటు కేసులో అనేక విధానపరమైన లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు.