ఐబొమ్మకే బొమ్మ చూపించిన హైదరాబాద్ పోలీసులు.. సజ్జనార్ ఎంట్రీతో సీన్ రివర్స్!

ఐబొమ్మకే బొమ్మ చూపించిన హైదరాబాద్ పోలీసులు.. సజ్జనార్ ఎంట్రీతో సీన్ రివర్స్!

సినీ పరిశ్రమకు పెను సవాల్‌గా మారిన ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్‌ 'ఐబొమ్మ' (IBOMMA) నిర్వాహకుడిని పట్టుకునేందుకు తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ, పక్కా ప్రణాళికతో తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల కొత్త సినిమాలను అప్‌లోడ్ చేస్తూ సినీ నిర్మాతలకు భారీ నష్టం కలిగిస్తున్న ఈ వెబ్‌సైట్‌పై పోలీసులు దృష్టి సారించారు. లేటెస్ట్ గా అంతర్రాష్ట్ర పైరసీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 

పైరసీ ముఠా అరెస్ట్‌

తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీపై ఉక్కుపాదం మోపారు.  లేటెస్ట్ గా దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేసి పెద్ద ఎత్తున అంతర్రాష్ట్ర పైరసీ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో 'ఐబొమ్మ' కోసం పనిచేస్తున్న నలుగురి నిందితులను కూడా హైదరాబాద్‌ సైబర్ క్రైమ్  పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న సినిమాలను కూడా అక్రమంగా 'bappam' అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న ఈ నిర్వాహకుడి కోసం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇప్పుడు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

ALSO READ : ఐబొమ్మ vs పోలీసులు: ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం!

'ఐబొమ్మ' నిర్వాహకుడి కోసం వేట..

'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడ కూడా గాలించారు. అయితే, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కచ్చితంగా తెలియడం లేదని, అతను విదేశాల్లో ఉండి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుండవచ్చని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేసి సినీ పరిశ్రమకు ఊరటనిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఐ బొమ్మ కోసం ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లు పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే పలువురని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపులు ముమ్మరం చేశారు.

పోలీసులకే 'ఐబొమ్మ' సవాల్!

పోలీసులు తన కోసం గాలిస్తున్న ప్రస్తుత సమయంలో 'ఐబొమ్మ' నుంచి వచ్చిన ఓ ప్రకటన సంచలనంగా మారింది. గతంలో, అంటే సుమారు రెండేళ్ల క్రితం, ఫిల్మ్ ఛాంబర్‌కు హెచ్చరికలు పంపి వార్తల్లో నిలిచిన 'ఐబొమ్మ', ఈసారి ఏకంగా పోలీసులు, సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ఓ కౌంటర్ నోట్‌ను విడుదల చేసింది.

ఆ పోస్ట్‌లో, "ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే.. మేం ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం," అంటూ పోలీసులను సూటిగా ప్రశ్నించింది. "మీ యాక్షన్‌కి నా రియాక్షన్ ఉంటుంది," అని హెచ్చరించింది. ఈ సవాల్‌తో కూడిన నోట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. చట్టాన్ని ధిక్కరిస్తూ, అధికారులకే సవాల్ విసురుతున్న ఈ నిర్వాహకుడి తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. 'ఐబొమ్మ' నిర్వాహకుడిని ఎంత త్వరగా పట్టుకుంటారో, ఈ సంచలన పోస్టుకు పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.