ఐబొమ్మ vs పోలీసులు: ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం! టాలీవుడ్ కి ఐబొమ్మ సవాల్!

ఐబొమ్మ vs పోలీసులు: ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం! టాలీవుడ్ కి ఐబొమ్మ సవాల్!

సినీ పరిశ్రమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ. కొత్త సినిమాలు థియేటర్‌లో అడుగుపెట్టాయో లేదో... కొన్ని గంటల్లోనే అవి ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం నిర్మాతలకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. ఒక్కోసారి ఇంకా విడుదల కాని సినిమాలు సైతం పైరసీ బారిన పడి, ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. అయితే, ఈ పైరసీ వ్యవహారంలో కొందరు సైబర్‌ నేరగాళ్లు ఏకంగా బ్లాక్‌మెయిల్‌కు కూడా పాల్పడుతున్నారనే సంచలన సమాచారం ఉంది. సినిమా విడుదల కంటే ముందే తాము అడిగినంత ఇవ్వకపోతే పైరసీ చేస్తామని డిమాండ్‌ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

దక్షిణాది సినిమాలకు ప్రధాన లక్ష్యంగా మారిన వెబ్‌సైట్‌లలో ఒకటిగా ‘ఐబొమ్మ’ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో, ఇటీవల తెలంగాణ పోలీసులు పైరసీ ముఠాపై ఉక్కుపాదం మోపారు. పెద్ద ఎత్తున ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ‘ఐబొమ్మ’ నిర్వాహకుడిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు బహిరంగంగా ప్రకటించారు. 

పోలీసులకు ఐబొమ్మ సూటి ప్రశ్న..

అయితే, పోలీసులు చేసిన ఈ ప్రకటన తర్వాత ‘ఐబొమ్మ’ పేరుతో విడుదలైన ఒక నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. పోలీసుల ప్రకటనకు కౌంటర్‌ ఇస్తూ, సూటి ప్రశ్నలతో కూడిన ఈ లేఖ సంచలనంగా మారింది. ఆ పోస్ట్‌లో ప్రధానంగా "ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే... మేం ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం," అంటూ పోలీసులుకు ఒకరకమైన సవాల్ విసిరింది. "డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు పట్టనట్టు ఉండి, కేవలం మీ ఓటీటీ (OTT) రెవెన్యూ కోసం ఆలోచిస్తూ... మాపై దృష్టి పెట్టారు," అని ఆరోపించింది. పైరసీకి మూలకారణమైన కెమెరా ప్రింట్స్ (Cam Prints) రిలీజ్ చేసే వెబ్‌సైట్లపై ముందు దృష్టి పెట్టాలని డిమాండ్ చేసింది. తాము సిగరెట్ నుంచి ఈ-సిగరెట్‌కు యూజర్స్‌ని మళ్లించే ప్రక్రియ లాంటివారమని పేర్కొంది.  మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుందని హెచ్చరించింది.

హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా?

ఈ నోట్‌లో సినీ ఇండస్ట్రీలోని కీలక అంశాలపై వేలెత్తి చూపించేవిధంగా ప్రశ్నించింది. ప్రధానంగా హీరోల రెమ్యూనరేషన్ అంశాన్ని ఐబొమ్మ ప్రస్తావించింది. హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా..." అంటూ నేరుగా ప్రశ్నించింది. ఈ మిడిల్ లో వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం అని నోట్ లో పేర్కొంది..

"సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి. కానీ మీ హీరోకి హీరోయిన్‌కి వస్తాయా?" అంటూ నిర్మాణ సిబ్బంది వేతనాలను హీరోల రెమ్యూనరేషన్‌తో పోల్చింది.

చివరకు మధ్యతరగతివాడిపై భారం.. 

సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం విదేశీ షూటింగ్‌లు, ట్రిప్‌లకు ఖర్చు పెడుతున్నారని, ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించింది. ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గి, స్థానికులకు ఉపాధి దొరుకుతుందని సూచించింది. అనవసర బడ్జెట్ పెట్టి, ఆ బడ్జెట్ రికవరీ కోసం దానిని తమపై రుద్ది ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, దీని వల్ల టికెట్ ధరలు పెరిగి చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

చివరిగా, "(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to lose.)" అంటూ తీవ్రమైన హెచ్చరికతో ఈ నోట్‌ను ముగించడం ఇప్పుడు తెలుగు సినీ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సవాల్‌ను పోలీసులు ఎలా స్వీకరిస్తారు? ఈ పైరసీ సమరం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది వేచి చూడాలి.