
నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, నిర్మాతగా.. ఇలా అనేక రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు ధనుష్. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ స్టార్ హీరో చిత్రం 'ఇడ్లీ కడై'ని దసరాకు కానుకగా అక్టోబర్ 1, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది . పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి ధనుష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, సముద్రఖని, పార్థిబన్, నిత్యా మేనన్, షాలినీ పాండే, అరుణ్ విజయ్ వంటి అద్భుతమైన తారాగణం నటించారు.
ప్రచారంలో దూకుడు.. బుకింగ్స్‌లో వెనుకబాటు
సాధారణంగా తన సినిమాలకు పెద్దగా ప్రచారం చేయని ధనుష్, 'ఇడ్లీ కడై' కోసం మాత్రం స్వయంగా తమిళనాడు అంతటా పర్యటించి అభిమానులను కలసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కోయంబత్తూర్, మధురై, త్రిచి వంటి నగరాల్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడంతో, ఈ చిత్రం బుకింగ్స్‌లో రికార్డు సృష్టిస్తుందని అంతా భావించారు. అయితే, విడుదల కావడానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా, టికెట్ బుకింగ్‌లు చాలా నెమ్మదిగా సాగుతుండటంతో చిత్ర బృందం ఆందోళన చెందుతోంది. ధనుష్ స్థాయికి ఇలాంటి పరిస్థితి ఊహించనిదిగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
'ఒకటి కొంటే ఒకటి ఉచితం' టికెట్ ఆఫర్
ఈ నేపథ్యంలో, అభిమానులను థియేటర్ల వైపు ఆకర్షించడానికి నిర్మాతలు, ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కొత్త వ్యూహాన్ని తెరతీశారు. ఒక టికెట్ కొనుగోలు చేస్తే, మరొకటి ఉచితంగా ఇచ్చే 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' (Buy One Get One Free - BOGO) అంటూ కొత్త ఆఫర్‌ను ప్రకటించారు.
బాక్సాఫీస్ బుకింగ్‌లను పెంచడానికి చేసిన ఈ ప్రకటనపై అభిమానుల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు సోషల్ మీడియాలో, "ధనుష్ సినిమాకు ఈ స్థాయి రాయితీ ఇవ్వాల్సిన సమయం వచ్చిందా?" అంటూ మీమ్స్‌తో ఆటపట్టిస్తుండగా, మరికొందరు, కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునే అభిమానులకు ఇది ఒక గొప్ప వరంగా అభివర్ణిస్తున్నారు.
ఇదిలా ఉండగా లేటెస్ట్ గా 'సాక్నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం, 'ఇడ్లీ కడై' ప్రీ-సేల్స్ ద్వారా సుమారు రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఈ ఆఫర్‌తో ఓపెనింగ్ రోజున ఈ చిత్రం సుమారు రూ.7 నుండి రూ.8 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
పండుగ సెలవు కలిసి వస్తుందా?
'ఇడ్లీ కడై' బాక్సాఫీస్ వద్ద తొలి రోజు నుంచే తుఫాన్ సృష్టిస్తుందని సినిమా పరిశ్రమ వర్గాలు మాత్రం విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఆయుధ పూజ సెలవుదినం సందర్భంగా విడుదలవుతున్న ఈ రూరల్ డ్రామాకు, దేశవ్యాప్తంగా హాలిడే బెనిఫిట్ లభిస్తుందని, మౌత్ టాక్ బాగుంటే వసూళ్లలో భారీ దూకుడు చూపించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. ధనుష్ లాంటి బహుముఖ ప్రతిభ ఉన్న నటుడి నుంచి వచ్చిన సినిమా కాబట్టి, కంటెంట్ బలంగా ఉంటే ఈ ఆఫర్‌లు అవసరం లేకుండానే విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.