కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం ఆఫీసర్లు నిర్వహించిన సర్వే తప్పుల తడకగా మారింది. అన్ని అర్హతలు ఉన్న వారిని అనర్హులుగా పేర్కొనడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 4,500 మందికి అండగా రాజకీయ పార్టీలు ఆందోళన బాట పట్టాయి. జిల్లా కలెక్టర్ స్పందించి తప్పిదాలపై ఎంక్వైరీ చేసి జిల్లా స్థాయి అధికారి నేతృత్వంలో మళ్లీ సర్వే చేస్తామనిహామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రీసర్వే, ఎంక్వైరీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిరుపేదలకు నిరీక్షణ తప్పడం లేదు.
లిస్టు అంతా తప్పుల తడక
మందమర్రి మున్సిపాలిటీలో 400 డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా మరో 160 ఇండ్ల పనులు సాగుతున్నాయి. ఇండ్ల కోసం 2480 మంది దరఖాస్తు చేసుకున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 286 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా సుమారు 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మందమర్రి మున్సిపాలిటీలో 521 మంది అర్హులని,1959 మంది అనర్హులనంటూ తేల్చారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 302 మంది అర్హులని1579 మంది అనర్హులంటూ ఫిబ్రవరి 28న రెవెన్యూ ఆఫీసర్లు లిస్టులు వేశారు. లిస్టుల్లోని పేర్లపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇల్లు లేకున్నా ఉన్నట్లుగా, కిరాయి ఇల్లు సొంత ఇల్లుగా.. చిన్నపాటి గుడిసె ఉన్న వాళ్లకు పక్కా బిల్డింగ్ ఇల్లు ఉందని అర్హులైన వారిని అనర్హుల లిస్టులో చేర్చారు.
ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ లీడర్లు చెప్పిన పేర్లను మాత్రమే అర్హుల లిస్టులో ఉంచారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. రీ సర్వే చేసి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, ఇతర సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. లిస్టులపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. దీంతో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ స్పందించి మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రదర్శించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాబితా తుది జాబితా కాదని పేర్కొన్నారు. మొదటి విడతలో దరఖాస్తు చేసుకొని జాబితాలో పేరులేని అర్హత కలిగిన వాళ్లు సంబంధిత సర్టిఫికెట్లతో మున్సిపల్ ఆఫీసుల్లో మార్చి 6 వరకు సంప్రదించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులపై జిల్లా ఆఫీసర్లు రీ ఎంక్వైరీ జరిపించి, అర్హులైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రెండు మున్సిపాలిటీల్లో 823 మంది అర్హులుగా లిస్టులో పేర్కొంటే ఎనిమిది రోజు వ్యవధిలో మందమర్రిలో 619 మంది, క్యాతనపల్లి లో 410 మంది అభ్యంతరాలతో దరఖాస్తులను ఆఫీసర్లకు అందించారు.
ఆఫీసర్‌ను నియమించలేరు.. రీ సర్వే షురూ కాలె
సర్వేలో తప్పిదాలపై జిల్లా స్థాయి అధికారితో ఎంక్వైరీ చేసి నిజమైన అర్హులను గుర్తిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చి రెండు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు ఆఫీసర్‌ను నియమించలేదు. ఎలాంటి ఎంక్వైరీ, రీ సర్వేకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. మరో వైపు అభ్యంతరాల నేపథ్యంలో ఇండ్ల కోసం అదనంగా మరో 1000 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఒక్కో ఇంటి కోసం ఆరు, ఏడు కుటుంబాలు పోటీ పడటం కట్టిన ఇండ్లు తక్కువ.. వచ్చిన అప్లికేషన్లు ఎక్కువ కావడంతో ఇండ్ల కేటాయింపు వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజాప్రతినిధులు అంటున్నారు. దీంతో రీ సర్వేకు ఎలాంటి ఒత్తిడి తీసుకు రావడం లేదు. ఇంకో వైపు ఇండ్ల కోసం బాగా పోటీ ఉండటం.. పొలిటికల్ ప్రెషర్ తోడవడంతో లాటరీ పద్ధతిలో ఇండ్ల మంజూరుకు ఆఫీసర్లు వెనకాడుతున్నారు. లీడర్లు చెప్పినట్టు చేస్తే అర్హులైన వారి నుంచి ఇబ్బందులు వస్తాయన్న భయంతో ఆఫీసర్లు లబ్ధిదారుల ఎంపికకు చేసే రీ సర్వేను వాయిదా వేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రీసర్వే కోసం ఇప్పటికి కలెక్టర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మందమర్రి తహసీల్దార్ సంపతి శ్రీనివాస్ తెలిపారు.
రీసర్వేకు ఆఫీసర్లు చొరవచూపాలె
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపునకు చేసిన సర్వే తప్పుల తడకగా ఉంది. అధికార పార్టీ లీడర్లు, ప్రజా ప్రతినిధులు చెప్పిన పేర్లను లిస్టుల్లో పెట్టారు. రెండు నెలలు గడుస్తున్న రీ సర్వే చేపట్టలేదు. కలెక్టర్ చొరవ చూపి మళ్లీ రీసర్వే చేయించి నిరుపేదలకు ఇండ్లను కేటాయించాలె.
-మహంకాళీ శ్రీనివాస్, బీజేపీ లీడర్