సూర్యాపేట, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన ఉద్యమంలో అన్ని శాఖల అధికారులు బాధ్యతగా భాగస్వామ్యం కావాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కె. నరసింహతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుం,ఇ ప్రజలు, విద్యార్థులు, యువతను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు.
ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ కార్యాలయాల వద్ద ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ నిబంధన అమలు చేయాలని, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, డయల్ 100, 108 సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. అనంతరం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన రోడ్డు భద్రత అవగాహన పాంప్లెట్స్ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
