
- సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
గోదావరిఖని, వెలుగు : ‘వ్యవసాయానికి సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది.. నీళ్లివ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో పూర్తిగా నింపి ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం’ అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సుందిళ్ల ప్రాజెక్ట్‌ను సందర్శించిన అనంతరం గోదావరిఖనిలోని మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంట్లో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రైతులకు సాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న ప్రాజెక్ట్‌లలో నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. లక్షలాది ఎకరాలకు అందాల్సిన సాగునీరు వృథాగా సముద్రం పాలవుతోందన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కన్నేపల్లి బ్యారేజిలకు ఎలాంటి ఇబ్బంది లేదని, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు అవి సిద్ధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో నాయకులు కౌశికహరి, నడిపెల్లి మురళీధర్‌రావు, పీటీ.స్వామి, పెంట రాజేశ్, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, చెలకలపల్లి శ్రీనివాస్, అచ్చే వేణు, నూతి తిరుపతి పాల్గొన్నారు.