- స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కోసం.. పైపై మెరుగులు
- శివారు మున్సిపాలిటీల్లో అధికారుల హడావుడి
హైదరాబాద్, వెలుగు:స్వచ్ఛ సర్వేక్షణ్–-2022 సర్వే ప్రారంభానికి ముందే సిటీ శివారు మున్సిపాలిటీలు పైపై మెరుగులు అద్దుకుంటున్నాయి. అవార్డుల కోసం అధికారులు ఆ మాత్రం హడావుడి చేస్తున్నారు. అవార్డులే టార్గెట్‌గా మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో అధికారులు, పాలకులను స్వచ్ఛ సర్వేక్షణ్‌పై స్పెషల్ నజర్ పెట్టారు. మొన్నటి వరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీనింగ్ గురించి ఏ మాత్రం పట్టించుకోవని అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పై ఎక్కడికక్కడ హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో హంగామా చేస్తున్నారు. రోడ్లపై చెత్త వేస్తే రూ.500 ఫైన్ విధిస్తామని హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేశారు. కొత్త మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన ఏడాదికి కూడా డస్ట్ బిన్లను పంపిణీ చేయని అధికారులు ఇటీవల ఇంటింటికి తడి, పొడి చెత్త కోసం రెండు డస్ట్ బిన్లను అందించారు. ఎలాగైనా అవార్డు సాధించాలని ఇప్పటికే రూ.కోట్లు ఖర్చు చేశారు.
లేకున్నా ఉన్నట్లుగా చూపిస్తూ...
గ్రేటర్ శివార్లలో 7 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనేందుకు ముందుగా నామినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్ల నుంచి అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. కాలనీల్లో 500 మీటర్లకు ఒక టాయిలెట్, ఆయా కాలనీలకు నీటిసదుపాయంతో కూడిన ఫంక్షన్ హాల్, చెత్త నిర్వహణ, చెట్లు తదితర అన్ని సరిగ్గా ఉన్నాయని వీరి నుంచి తీసుకుంటున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉండటంతో అన్ని బాగున్నాయని ఇచ్చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఇవి లేవంటూ ఇస్తున్నారు. బండ్లగూడ జాగీర్, బోడుప్పల్ తదితర మున్సిపాలిటీల్లో చాలా మంది కార్పొరేటర్లు ఈ ఫెసిలిటీస్ తమ కాలనీల్లో లేవని చెప్తున్నారు. ఈ విషయంపై కొన్నిచోట్ల అధికార పార్టీకి చెందిన వారే సీరియస్ అవుతున్నారు. నామినేట్ చేసేముందు కాలనీల్లో తిరిగి చూడాలని అంటున్నారు.
సర్వే కోసమే అన్నట్లుగా ఏర్పాట్లు
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగిన ప్లానింగ్ రెడీ చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి స్థానిక సంస్థల కమిషనర్లకు ఆదేశాలు అందడంతో వారు వేరే పనులు పెట్టుకోకుండా దీనిపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు చూస్తుంటే.. కేవలం అవార్డు కోసం, ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టాలనే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నడూ స్వచ్ఛపై అవగాహన కల్పించని అధికారులు ఇప్పుడు ఒక్కసారిగా కాలనీలు, బస్తీల్లో ప్రత్యక్షమవుతున్నారు. చెత్త బయట వేయొద్దని ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంటికొచ్చే చెత్త ఆటోలు డైలీ ఎందుకు రావడంలేదనే ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోతున్నారు.
పట్టణ ప్రగతిని పట్టించుకోలే....
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శివారు మున్సిపాలిటీలు పెద్దగా పట్టించుకోలేదు. గతేడాది జులైలో 10 రోజుల పాటు నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎటువంటి అభివృద్ధి కనిపించలేదు. ప్రస్తుతం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్ లను ఎలాగైనా సాధించాలని అందుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో హుటాహుటిన స్పందించారు. ప్రధానంగా ఈ సారి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో డిజిటల్ ట్రాకింగ్, జియో-ట్యాగింగ్, పెరిగిన వ్యక్తుల కోసం క్యూఆర్ కోడ్, క్లీన్ సిటీ, పబ్లిక్ టాయిలెట్ తదితర వాటిపై ప్రజల నుంచి కేంద్రం ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది.
