శ్రీలంక ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ గా శ్రీధర్‌‌

శ్రీలంక ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ గా శ్రీధర్‌‌

కొలంబో: శ్రీలంక జట్టు ఫీల్డింగ్‌‌ కోచ్‌‌గా ఆర్. శ్రీధర్‌‌ను నియమించుకుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌‌ కప్‌‌ వరకు అతను ఈ పదవిలో ఉంటాడని లంక బోర్డు బుధవారం ప్రకటించింది. 2014 నుంచి 2021 వరకు టీమిండియాకు ఫీల్డింగ్‌‌ కోచ్‌‌గా వ్యవహరించిన శ్రీధర్‌‌.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంక నేషనల్‌‌ హై పెర్ఫామెన్స్‌‌ సెంటర్‌‌లో పది రోజుల ప్రత్యేక ఫీల్డింగ్‌‌ శిబిరాన్ని నిర్వహించాడు. దీనికి సంతృప్తి చెందిన లంక బోర్డు శ్రీధర్‌‌కు ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ బాధ్యతలను అప్పగించింది. 

బీసీసీఐ లెవల్‌‌–3 కోచింగ్‌‌ అర్హత కలిగిన శ్రీధర్‌‌ ఇండియా తరఫున 300 మ్యాచ్‌‌లకు ఫీల్డింగ్‌‌ కోచ్‌‌గా వ్యవహరించాడు. ‘శ్రీధర్‌‌ను ఫీల్డింగ్‌‌ కోచ్‌‌గా నియమించుకున్నందుకు సంతోషంగా ఉంది. మా జట్టు ఫీల్డింగ్‌‌ను గణనీయంగా మెరుగుపరుస్తాడని ఆశిస్తున్నాం. ముందుగా పాక్‌‌, ఇంగ్లండ్‌‌ టూర్లతో మా ప్లేయర్లతో కలిసి పని చేస్తాడు. 

ఆ తర్వాత టీ20 వరల్డ్‌‌కప్‌‌పై దృష్టిపెడతాడు’ అని లంక బోర్డు వెల్లడించింది. ఒక వ్యవస్థపై పని చేయడం కాకుండా గ్రౌండ్‌‌లో అథ్లెటిసిజం, ప్లేయర్ల మధ్య అవగాహన పెంపొందించడం వంటి అంశాలపై దృష్టి పెడతానని శ్రీధర్‌‌ అన్నాడు.