
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌పై అన్ని జిల్లాల్లో రచ్చబండ నిర్వహించాలని ఆదేశిస్తే.. ఎందుకు లైట్ తీసుకున్నారని డీసీసీ అధ్యక్షులపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు రచ్చబండ కార్యక్రమాల నిర్వహణపై నివేదిక ఇచ్చారు. చాలా జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమం తూతూమంత్రంగా చేశారనే వివరాలు ఆ రిపోర్ట్‌లో పొందుపరిచారు. శనివారం గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇందులో మాణిక్కం ఠాగూర్‌తో పాటు ఏఐసీసీ సెక్రటరీలు బోసురాజు, శ్రీనివాసన్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, పార్టీ కమిటీల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ మరోసారి పర్యటించనుండటంతో ఆ టూర్ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీలో చేరికలపైనా డిస్కస్ చేశారు. ఇంకోసారి రచ్చబండపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు.
సమావేశం తర్వాత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రైతాంగాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుతో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు. రాహుల్ డిక్లరేషన్‌పైనే రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో రచ్చబండ నిర్వహించేందుకు ఇంకా టైం పొడిగించామని తెలిపారు. ఆగస్టులో రాష్ట్ర పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చే అవకాశముందని, ప్రతి రెండు నెలలకోసారి ఆయన రాష్ట్రానికి వస్తారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ అవినీతిని కట్టడి చేస్తామనిచెప్పారు. పార్టీలో సమ్మతి, అసమ్మతి అనేది లేదని.. తానే లీడర్లందరినీ లంచ్‌కు ఆహ్వానిస్తున్నానని తెలిపారు.