మిస్టరీ మ్యాన్.. ఎక్కడ్నించి వచ్చింది ఇప్పటికీ తేలలేదు

మిస్టరీ మ్యాన్.. ఎక్కడ్నించి వచ్చింది ఇప్పటికీ తేలలేదు

అనగనగా ఓ దేశం. దాని పేరు టౌర్డ్​. కాకపోతే అది ఈ భూమ్మీద లేదు. ఆ దేశ గవర్నమెంట్​  తమ పౌరులకు పాస్​పోర్ట్​లు కూడా ఇస్తుందట. అది పట్టుకుని సరాసరి జపాన్ ‌‌లోని ఎయిర్ ‌‌ ‌‌పోర్ట్​కి వచ్చాడు ఓ వ్యక్తి. పైగా వరల్డ్​ మ్యాప్​లో తన దేశం పేరు లేదని గోల చేశాడు. అంతేకాదు.. ఈ భూమ్మీద తిరిగిన చాలా దేశాల స్టాంపులు తన పాస్​పోర్ట్​లో ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవంగా జరిగింది. అతనెవరు? ఎందుకలా చేశాడనేది ఇప్పటికీ మిస్టరీనే! 

అది 1954 జులై. ఒకరోజు జపాన్ ‌‌ రాజధాని టోక్యోలో ఉన్న హనెడా ఎయిర్​పోర్ట్​కు ఒక వ్యక్తి వచ్చాడు. అతని బట్టలు, వేషధారణ చూస్తే బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు. అందరు ప్యాసింజర్స్​లాగే కస్టమ్స్ ‌‌ చెకింగ్ పాయింట్​కు‌‌ వచ్చాడు. కస్టమ్స్‌‌ ఆఫీసర్లు పాస్​పోర్ట్ ‌‌చూపించమని అడిగారు. అతను వెంటనే పాస్​పోర్ట్ ‌‌ చూపించాడు. కానీ.. ఆ పాస్​పోర్ట్​ చూసిన ఆఫీసర్స్ కంగు తిన్నారు.

ఎందుకంటే.. ఆ పాస్​పోర్ట్ ‌‌ ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశానికీ చెందింది కాదు. దాన్ని చూసిన ఆఫీసర్లు అయోమయంలో పడ్డారు. ఆ పాస్​పోర్ట్​ అచ్చం ఒరిజినల్​ పాస్​పోర్ట్​లాగే ఉంది. అది టౌర్డ్​ అనే దేశానికి చెందింది. ఆ వ్యక్తి కూడా తను టౌర్డ్ దేశం నుంచి వచ్చానని చెప్పాడు. పైగా తన దేశం నుంచి జపాన్​కు వెళ్లడం అది మూడోసారి అని కూడా ఆ మిస్టరీ మ్యాన్ చెప్పాడు. కానీ, అక్కడి ఆఫీసర్లు టౌర్డ్​ అనే పేరు వినడం అదే మొదటిసారి. అందుకే దీన్ని  ‘టౌర్డ్ మిస్టరీ’ అని పిలుస్తుంటారు. అతని భాషను బట్టి తన దేశం కనుక్కోవాలి అనుకున్నారు. కానీ.. అతను ఎక్కువగా ఫ్రెంచ్​ మాట్లాడినప్పటికీ.. జపనీస్​తోపాటు ఇతర భాషలు కూడా మాట్లాడాడు.  

మ్యాప్​లో లేదేంటి? 

ఆఫీసర్లు ఎటూ తేల్చలేక అతనికి ఒక వరల్డ్​ మ్యాప్​ ఇచ్చారు. అందులో దేశాన్ని గుర్తించమని చెప్పారు. అతను వెంటనే ‘అండోరా ప్రిన్సిపాలిటీ’ ఆక్రమించిన ఒక ప్రాంతాన్ని చూపించాడు. అది ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో ఉంది. తన దేశం వయసు దాదాపు వెయ్యేండ్లు అని చెప్పాడు. తన దేశానికి సంబంధించిన వివరాలు ఆఫీసర్లకు తెలియకపోవడంతో ఆశ్చర్యపోయాడు. పైగా తన దేశాన్ని ‘అండోరా’ అంటున్నందుకు వాళ్లపై మండిపడ్డాడు. వాళ్ల మ్యాప్​లో తన దేశం పేరు లేనందుకు పెద్ద గొడవ చేశాడు. 

అరెస్ట్​.. విచారణ...

అతను ఎక్కడి నుంచి వచ్చాడనేది తెలుసుకునేందుకు అధికారులు అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ చెక్ ‌‌ చేశారు. ప్రపంచంలోని చాలా దేశాల కరెన్సీలు అతని వద్ద ఉన్నాయి. దాంతో అతను ఒక బిజినెస్​మ్యాన్​​ అనుకున్నారు. బిజినెస్​ పనిమీద ట్రావెల్​ చేస్తుంటాడని ఒక అంచనాకు వచ్చారు. తర్వాత అతను పని చేస్తున్న కంపెనీ, దిగిన హోటల్ వివరాలు కూడా చెప్పాడు. అవి టోక్యోలోనే ఉన్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. కానీ.. ఆ హోటల్​లో అతని పేరుతో ఎలాంటి బుకింగ్స్​ లేవు. దాంతో అతను ఏదో తప్పు చేస్తున్నాడని అనుమానించి, అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్న వస్తువులు, డాక్యుమెంట్లు లాగేసుకున్నారు. తర్వాత అతన్ని ఒక హోటల్​లో ఉంచారు. 

ఏమయ్యాడు? 

మిస్టరీ మ్యాన్ తప్పించుకోకుండా ఉండటానికి హోటల్​ గది దగ్గర ఇద్దరు గార్డులను కాపలా పెట్టారు. హోటల్​ బయట కూడా పోలీసులు కాపలా ఉన్నారు. రాత్రి గది తలుపులు మూసుకుని పడుకున్నాడు.  ఉదయం తలుపులు తెరిచి చూసేసరికి గదిలో లేడు.

ఆ హోటల్​కు ఒకే దారి ఉంది. అయినా.. అతను అక్కడి నుంచి ఎలా మాయమయ్యాడు అనేది ఇప్పటికీ మిస్టరీనే. పోలీసుల దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కూడా కనిపించకుండా పోయాయి. అతని కోసం సిటీ మొత్తం వెతికినా దొరకలేదు. 

అసలేం జరిగింది? 

మిస్టరీ మ్యాన్ మాయమైన తర్వాత చాలా కథలు ప్రచారంలోకి వచ్చాయి. చాలామంది అతను నిజంగా టౌర్డ్​ దేశానికి చెందినవాడే అన్నారు. అయితే, ఆ దేశం మరొక విశ్వంలో ఉందని, ఈ రెండు ప్యారలల్ ‌‌ డైమెన్షన్ ‌‌లోకి వచ్చినప్పుడు అతను మన విశ్వంలోకి వచ్చాడని వాదించారు.

మరో సిద్ధాంతం ప్రకారం.. మిస్టరీ మ్యాన్ టైమ్ ట్రావెల్​ చేశాడని, అతను మన భవిష్యత్తు నుంచి వచ్చాడని చెప్తారు. ఇంకొందరు మాత్రం ‘ఈ స్టోరీ ఒక బూటకం. సరదాగా సృష్టించిన కట్టుకథ’ అని కొట్టి పారేస్తున్నారు. ఏదేమైనా కొన్నేండ్ల నుంచి ఈ విషయంపై కథనాలు వస్తూనే ఉన్నాయి. 

షార్ట్​ఫిల్మ్​

టౌర్డ్ మిస్టరీ మీద ఒక షార్ట్​ ఫిల్మ్​ కూడా వచ్చింది. దాని పేరు ‘‘ద మ్యాన్​ ఫ్రమ్​ టౌర్డ్’’. ​ఇదే పేరుతో ఒక నవల కూడా మార్కెట్​లోకి వచ్చింది. దీన్ని జెరెమీ బేట్స్​ రాశాడు. ఇక వార్త కథనాలు, డాక్యుమెంటరీలకు అయితే లెక్కేలేదు. ఇప్పటివరకు దీనిమీద ఎన్నో కథనాలు పబ్లిష్​ అయ్యాయి.