తెలంగాణ సెంటిమెంట్ను.. కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నరు

తెలంగాణ సెంటిమెంట్ను.. కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నరు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సెంటిమెంట్ ను సీఎం కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మండిపడ్డారు. 1,200 మంది ఉద్యమకారులు అమరులైతే.. వారికి పరిహారం, ఉద్యోగాలు ఇచ్చే టైమ్ కి సంఖ్యను తక్కువ చూపారన్నారు. ఆదివారం ఓ హోటల్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాములు నాయక్ అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ కారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్​లో రాములు నాయక్ మాట్లాడారు. సామాజిక తెలంగాణను ప్రజలు కోరుకున్నారని, రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీకి జనం ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ పార్టీ హయాంలో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయని, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు పాలిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మళ్లీ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ కేసీఆర్ అధికారంలోకొస్తే.. జనం కిడ్నీలు కూడా అమ్మేస్తారని ఎద్దేవా చేశారు.

ఒక్కో ఫ్యామిలీకి కోటి ఇవ్వాలి : అద్దంకి దయాకర్ 

ఉద్యమం చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ఒక్కో అమరుడి కుటుంబానికి కేసీఆర్ సర్కార్ కోటి రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులు స్వార్థం చూసుకోలేదని, వారిని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కలిసికట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. 

సామాజిక తెలంగాణకు  కృషి చేయాలి : చెరుకు సుధాకర్ 

రాష్ట్రంలో సామాజిక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని చెరుకు సుధాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలిపారు. పొన్నం ప్రభాకర్​కు ప్రియారిటీ ఇవ్వకుండా.. మొన్న వచ్చిన పొంగులేటికి ప్రాధాన్యత ఇచ్చారని, ఈ అంశంలో పొన్నం బాధపడటంలో తప్పులేదన్నారు. బీఆర్ఎస్​లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్​దే అధికారం : బెల్లయ్య నాయక్

19 ఏండ్లు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఎజెండా సోషల్ జస్టిస్ అని పీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉద్యమం చేసినట్లు నటించారని, స్టూడెంట్లు, ఆర్టీసీ కార్మికులు ఇలా ఎంతో మంది పోరాటాలతో రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. సామాజిక తెలంగాణ రావాలనే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని వివరించారు.