ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ...ఉదయం 11:30 ఉభయ సభలు ప్రారంభం

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ...ఉదయం 11:30 ఉభయ సభలు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలను ఆగస్టు 3వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వర్షాకాల సమావేశాలను గత సెషన్​కు కొనసాగింపుగానే నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎనిమిదో సెషన్​ఐదో మీటింగ్, కౌన్సిల్​18వ సెషన్​ఐదో మీటింగ్​ఆగస్టు మూడో తేదీన ప్రారంభమవుతుందని అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు కంటోన్మెంట్​ఎమ్మెల్యే సాయన్న మృతికి సభ సంతాపం ప్రకటిస్తుంది. ఆ తర్వాత స్పీకర్ ​అధ్యక్షతన అసెంబ్లీ బీఏసీ, కౌన్సిల్​లో చైర్మన్​ అధ్యక్షతన కౌన్సిల్​బీఏసీ సమావేశాలు నిర్వహించి సభ ఎన్ని రోజులు నడపాలి, ఏయే అంశాలపై చర్చించాలని నిర్ణయిస్తారు. కనీసం ఐదు నుంచి ఏడు పనిదినాలు అసెంబ్లీ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్​లోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ముందు చివరి సెషన్ కావడంతో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. 

రెండేండ్లుగా ప్రొరోగ్​చేస్తలే..

అసెంబ్లీ, కౌన్సిల్​సమావేశాలను రెండేండ్లుగా ప్రొరోగ్ చేయకుండానే కొనసాగిస్తున్నారు. 2021 సెప్టెంబర్​24 నుంచి అక్టోబర్​ఎనిమిదో తేదీ వరకు ఏడు రోజుల పాటు తెలంగాణ రెండో అసెంబ్లీ ఎనిమిదో సెషన్​నిర్వహించారు. దానికి కొనసాగింపుగానే 2022 మార్చి ఏడో తేదీ నుంచి 15 వరకు ఏడు రోజుల పాటు బడ్జెట్​సెషన్​నిర్వహించారు. అదే ఏడాది సెప్టెంబర్​ఆరో తేదీ నుంచి 13 వరకు మూడు రోజుల పాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి 12 వరకు ఏడు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. 2022 బడ్జెట్​సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం కూడా లేదు. ఈ ఏడాది అనేక తర్జనభర్జనల తర్వాత గవర్నర్​ప్రసంగం పెట్టి, ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిల్​18వ సెషన్​కు కొనసాగింపుగానే ఇప్పుడు ఐదో సమావేశాలు నిర్వహిస్తున్నారు.