- నేటి కేబినెట్ భేటీలో ఇవే ప్రధాన ఎజెండా
- కొండారెడ్డిపల్లి తరహాలోనే మరిన్ని సోలార్ విలేజ్‌ల ఏర్పాటు
- స్టూడెంట్ల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ కుటుంబ బీమా
- పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ శాఖలకు గైడ్‌లైన్స్ ఇచ్చే చాన్స్
- పంటల మార్పిడి దిశగా రైతులకు దిశానిర్దేశం చేసే అవకాశం
- సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియెట్‌లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు, నష్టాల ఊబిలో ఉన్న డిస్కంలను లాభాల బాట పట్టించేందుకు ఉద్దేశించిన ‘విద్యుత్ సంస్కరణల’పై కీలక చర్చ జరగనుంది. దీంతోపాటు అంతర్జాతీయ , జాతీయ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన పొదుపు చర్యలు, విద్యార్థుల ఖాతాలకు నేరుగా ఫీజ్రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్‌ల విడుదల, ప్రైవేట్, కార్పొరేట్విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, జూన్ 2 ఆవిర్భావ వేడుకలు, రెండోవిడత ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పింఛన్ల అమలు, సరికొత్త సోలార్ స్టవ్ స్కీం, పంట మార్పిడి ప్రణాళికలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు.
విద్యుత్ పంపిణీ సంస్థలను గట్టెక్కించాలని..
రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లను నష్టాల ఊబిలోంచి గట్టెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే జూన్ 2 నుంచి ‘రైతు డిస్కం’ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్, ఇతరత్రా సబ్సిడీ విద్యుత్ పథకాలన్నింటినీ ఈ మూడో డిస్కం ద్వారానే నిర్వహించనున్నారు. ఉచిత విద్యుత్ సరఫరాను యథాతథంగా కొనసాగిస్తూనే, ఫీడర్ల ఆధునికీకరణ ద్వారా వృథాను అరికట్టాలని భావిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా కోసం ‘హై-ఎఫిషియెన్సీ పంప్‌సెట్ల’ వాడకాన్ని ప్రోత్సహించడం పైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు రావాల్సిన పాత బకాయిల క్లియరెన్స్‌తోపాటు ప్రభుత్వ శాఖల కరెంట్ బిల్లులను సకాలంలో చెల్లించేలా కఠిన నిబంధనలను తీసుకురాబోతున్నారని, ఈ అంశాలపైనా చర్చ జరిగే అవకాశముందని సంబంధిత అధికారులు చెప్తున్నారు.
కొండారెడ్డిపల్లి తరహాలోనే మరికొన్ని గ్రామాల్లో..
సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి తరహాలోనే రాష్ట్రంలోని మరికొన్ని గ్రామాలను 100% గ్రీన్ ఎనర్జీ (సౌర విద్యుత్) విలేజెస్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గృహ వినియోగదారులు తమ ఇండ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న సబ్సిడీ స్కీమ్‌లను సమన్వయం చేయనున్నారు. కొండారెడ్డిపల్లిలో పైలెట్ ప్రాజెక్ట్‌గా అక్కడి ప్రజలకు సోలార్ స్టవ్‌ల పంపిణీ చేయగా.. అద్భుతంగా పనిచేస్తున్నాయి. దీంతో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఈ సోలార్ స్కీమ్‌కు మళ్లిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
పొదుపు చర్యలపై ఫోకస్..
ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై కేబినెట్‌లో చర్చించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. శాఖలవారీగా అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎక్కడెక్కడ అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చో చర్చించి, గైడ్‌లైన్స్ రూపొందించే అవకాశముంది. కరెంట్, పెట్రోల్, డిజీల్ వినియోగాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించాలని సీఎం ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇకపై ఈవీ వాహనాలే వాడాలని లక్ష్యం పెట్టుకున్నందున ఆ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు ఉద్యోగుల పనిదినాల తగ్గింపు అంశం కూడా చర్చకు రావచ్చని తెలుస్తున్నది.
ఖాతాల్లోకే స్కాలర్‌షిప్‌లు.. ఇందిరమ్మ బీమాకు గ్రీన్ సిగ్నల్!
ఇకపై స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే విడతలవారీగా జమ చేసే కొత్త విధానంపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇప్పటికే జీవో ఇవ్వగా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మూడు నెలలకోసారా? లేదా ఆరు నెలలకోసారా? అనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. అలాగే.. సంక్షేమ పథకాల సెకండ్ ఫేజ్‌పైనా కీలక నిర్ణయాలు రానున్నట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్ల పెంపుతోపాటు.. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా జూన్ 2 నుంచి అమల్లోకి తీసుకు రానున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ విధివిధానాలపై ఖరారు చేయనున్నారు. అటు ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్స్, జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో 500 ఎకరాల భూమి కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
వానాకాలం ప్లాన్.. రైతు వేదికల బాటలో సీఎం..
రాబోయే వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఈ కేబినెట్‌లో పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా సంప్రదాయ పంటలకే పరి మితం కాకుండా, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేలా పంటల మార్పిడి (క్రాప్ డైవర్సిఫికేషన్)పై ఈ కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించే అవకాశముంది. ఈ క్రమంలో తాను స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్టు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలను సందర్శించి, క్లస్టర్లవారీగా రైతులకు అవగాహన కల్పించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సీఎం యాక్షన్ ప్లాన్‌ను కేబినెట్‌లో ఖరారు చేసే అవకాశముంది. మరోవైపు.. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపైనా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది.
