టెక్కీలకు పండగే: వేరియబుల్ పే పెంచేసిన TCS.. కానీ ఆ ఒక్క కండిషన్ అప్లై!

టెక్కీలకు పండగే: వేరియబుల్ పే పెంచేసిన TCS.. కానీ ఆ ఒక్క కండిషన్ అప్లై!

దేశంలోని టాప్ ఐటీ కంపెనీ TCS తన ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత రెండేళ్లుగా వేరియబుల్ పే విషయంలో నిరాశగా ఉన్న మిడ్ అండ్ సీనియర్ లెవెల్ ఉద్యోగులకు ఈసారి భారీ ఊరట లభించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గానూ సగటున 60 నుంచి 80 శాతం వరకు క్వార్టర్లీ వేరియబుల్ అలవెన్స్ విడుదల చేసింది. గతంలో కేవలం 20 నుంచి 50 శాతం లోపే ఉన్న ఈ పేఅవుట్.. వరుసగా రెండో త్రైమాసికంలోనూ ఇంత భారీగా పెరగడంతో టెక్కీలు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏప్రిల్ నెల జీతంతో పాటే ఈ బోనస్ అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోయిందట ఉద్యోగుల ఖాతాల్లో.

అయితే ఈ శుభవార్త వెనుక కంపెనీ ఒక పెద్ద కండిషన్ పెట్టింది. ఆఫీస్ అటెండెన్స్ సరిగ్గా లేని ఉద్యోగుల వేరియబుల్ పేపై టీసీఎస్ భారీగా కోత విధించింది. కంపెనీ రూల్స్ ప్రకారం.. ఆఫీస్‌కు వచ్చి పనిచేసే రోజులను బట్టే ఈ బోనస్ అందుతుందంట. ఎవరైతే 85 శాతం కంటే ఎక్కువ అటెండెన్స్ కలిగి ఉంటారో వారికి మాత్రమే 100% వేరియబుల్ పే దక్కుతుంది. అలాగే 75-85 శాతం అటెండెన్స్ ఉన్నవారికి 75 శాతం, 60-75 శాతం అటెండెన్స్ ఉన్నవారికి కేవలం 50 శాతం మాత్రమే బోనస్ చెల్లిస్తోంది టీసీఎస్. 60 శాతం కంటే తక్కువ అటెండెన్స్ ఉంటే అసలు బోనస్కే అర్హులు కారు. ఆఫీస్ హాజరు శాతం 60% లోపు ఉండటం వల్లే చాలామంది సగం బోనస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

గత రెండేళ్లుగా కంపెనీ పర్ఫార్మెన్స్ లింక్డ్ పేఅవుట్స్‌ను భారీగా తగ్గించడంతో ఒక్కో సీనియర్ ఉద్యోగి దాదాపు రూ.4 నుంచి 5 లక్షల వరకు నష్టపోయారు. అయితే ఈసారి బిజినెస్ యూనిట్ల పనితీరు బాగుండటంతో మేనేజ్‌మెంట్ వేరియబుల్ పే శాతాన్ని పెంచింది. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ మాత్రం మార్చి త్రైమాసికానికి తన వేరియబుల్ పేను 70 శాతానికి తగ్గించింది. అంతకుముందు క్వార్టర్‌లో ఇన్ఫోసిస్ 85 శాతం బోనస్ చెల్లించింది.

మరోవైపు కొత్త లేబర్ కోడ్స్ మార్పులకు అనుగుణంగా సరికొత్త కాస్ట్-టు-కంపెనీ(CTC) స్ట్రక్చర్‌ను టీసీఎస్ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఏప్రిల్ నెల నుంచే ఉద్యోగులకు కొత్త శాలరీ ఇంక్రిమెంట్లను కూడా రోల్ అవుట్ చేసింది. ఈ అప్రైజల్ సైకిల్‌లో ఉద్యోగులకు సగటున 5 శాతం వరకు జీతాల పెంపు లభించింది. ఎప్పటిలాగే కంపెనీ పర్ఫార్మెన్స్ బ్యాండ్స్ ఆధారంగానే ఈ హైక్స్ కేటాయించింది.

కంపెనీ రేటింగ్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచిన ‘A+’ కేటగిరీ ఉద్యోగులకు అత్యధికంగా 9 నుంచి 13 శాతం వరకు జీతాలు పెరిగాయి. అలాగే ‘A’ బ్యాండ్ లో ఉన్నవారికి 5–9 శాతం, ‘B’ బ్యాండ్ లో ఉన్నవారికి 1–3.5 శాతం వరకు హైక్స్ లభించాయి. అయితే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని ‘C’ బ్యాండ్ ఉద్యోగులకు మాత్రం ఈ ఇంక్రిమెంట్లు చాలా నామమాత్రంగా ఉన్నాయి. ఏదేమైనా ఆఫీస్ అటెండెన్స్ రూల్స్ కచ్చితంగా పాటిస్తూ.. మంచి పర్ఫార్మెన్స్ చూపించిన టీసీఎస్ టెక్కీల అకౌంట్లలో మాత్రం కనకవర్షం కురిసిందనే చెప్పాలి.