- చివరి 500 ఆపరేషన్లు కేవలం మూడేండ్ల 4 నెలల్లోనే పూర్తి
- 1,900 మందికి ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఫ్రీగా ట్రాన్స్‌ప్లాంట్స్
- సౌత్ ఇండియాలోనే ప్రభుత్వ రంగంలో తొలి రోబోటిక్ కిడ్నీ మార్పిడితో రికార్డు
- వైద్య బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కీలక మైలు రాయిని చేరుకుంది. యూరాలజీ డిపార్ట్మెంట్ లో 2 వేల కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ లను విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలోనే అత్యధిక ట్రాన్స్ ప్లాంట్లు నిర్వహిస్తున్న అగ్రగామి ప్రభుత్వ హాస్పిటల్ గా నిలిచింది. 1989 నుంచి 2010 వరకు 448 ఆపరేషన్లు జరగ్గా.. 2011–2017 మధ్య 552, 2017–2023 మధ్య 500 సర్జరీలు జరిగాయి. గత మూడేండ్ల 4 నెలల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో చివరి 500 ట్రాన్స్ ప్లాంట్లు పూర్తి చేయడం విశేషం.
క్లిష్టమైన సర్జరీలు విజయవంతంగా..
యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నాయకత్వంలోని టీమ్ అత్యంత క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. బహుళ రక్తనాళాలున్న కిడ్నీల మార్పిడి, చిన్నారులకు ట్రాన్స్ ప్లాంట్లు, గతంలో ఫెయిల్ అయిన వారికి తిరిగి చేసే ‘రీ-ట్రాన్స్ ప్లాంట్’ వంటి సవాళ్లను కూడా డాక్టర్లు అధిగమించారు. 2025లో సౌత్ ఇండియాలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ లో మొదటి రోబోటిక్ కిడ్నీ మార్పిడిని నిమ్స్ విజయవంతంగా చేసింది. ప్రస్తుతం ఏడాదికి 11 వేల యూరాలజీ సర్జరీలు చేస్తుండగా.. గత మూడేండ్లలో 500కు పైగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించడం విశేషం. జీవదాతల ద్వారా జరిగిన మార్పిడిలో 95%, మరణించిన దాతల (కడావర్) ద్వారా జరిగిన మార్పిడిలో 90% చొప్పున ఒక ఏడాది తర్వాత ‘గ్రాఫ్ట్ సర్వైవల్’ రేటు నమోదైంది.
95 శాతం ఫ్రీ ట్రీట్మెంట్..
కిడ్నీ మార్పిడి ఆపరేషన్లలో 95 శాతం మంది రోగులకు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఫ్రీగా చికిత్స అందింది. సర్జరీ తర్వాత జీవితాంతం వాడాల్సిన ఖరీదైన మందులను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ఈ రికార్డ్ నెలకొల్పడంలో డాక్టర్ రాహుల్ దేవరాజ్ టీమ్ తో పాటు డాక్టర్ రాంరెడ్డి, విద్యాసాగర్ వంటి సీనియర్ ప్రొఫెసర్లు, అనస్తీషియా (డాక్టర్ నిర్మల టీమ్), నెఫ్రాలజీ (డాక్టర్ భూషణ్ రాజు టీమ్), రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్లు, నర్సింగ్ సిబ్బంది సమిష్టి కృషి ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం, హెల్త్ మినిస్టర్ ప్రశంసలు..
ఈ అరుదైన రికార్డ్ ను అధిగమించిన నిమ్స్ డాక్టర్స్ టీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా అవయవ మార్పిడి సేవలను విస్తరించేందుకు గాంధీ హాస్పిటల్ లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్, సనత్ నగర్ టిమ్స్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తున్నామనిమంత్రి దామోదర వెల్లడించారు.
