పాక్లో 23 మంది టెర్రరిస్టుల ఎన్‌‌‌‌కౌంటర్

పాక్లో 23 మంది టెర్రరిస్టుల ఎన్‌‌‌‌కౌంటర్


పెషావర్: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో భద్రతా దళాలు జరిపిన భారీ ఎదురుకాల్పుల్లో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం, గురువారాల్లో వరుసగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని పాక్ సైనిక మీడియా వింగ్ 'ఇంటర్- సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్' శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పక్కా సమాచారంతో దత్తా ఖేల్, స్పిన్‌‌‌‌‌‌‌‌వామ్, బన్నూ తదితర ప్రాంతాల్లో సైన్యం ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో మొత్తం 23 మంది ఉగ్రవాదులు మృతి చెందారు.  మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జాన్ మీర్ అలియాస్ 'తూర్ సాకిబ్' కూడా హతమయ్యాడు.

బంకర్లు, భూగర్భ సొరంగాలు ధ్వంసం..

ఘటనాస్థలాల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, ఐఈడీలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులు దాక్కోవడానికి ఉపయోగించే భూగర్భ సొరంగాలు, రహస్య బంకర్లను సైన్యం గుర్తించి పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టిన 'అజ్మ్-–ఎ–-ఇస్తేహ్కామ్' ఉగ్రవాద నిరోధక కార్యక్రమంలో భాగంగా ఈ దాడులు ముమ్మరం చేసినట్లు సైన్యం తెలిపింది.