సీఎంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం : ఎంపీ బలరాం నాయక్

సీఎంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం : ఎంపీ బలరాం నాయక్
  • కేటీఆర్ ఖబర్దార్ అంటూ ప్రజాప్రతినిధుల హెచ్చరిక​

హైదరాబాద్, వెలుగు: ‘సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. కేటీఆర్ ​ఖబర్దార్’​ అని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ హెచ్చరించారు. శుక్రవారం సీఎల్పీలో విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, రాందాస్ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లినప్పుడు, నేరెళ్లలో దళితులను హింసించినప్పుడు కేటీఆర్ ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు.

తమకు సంస్కారం ఉంది కాబట్టే గౌరవంగా మాట్లాడుతున్నామని, కేటీఆర్ కు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. విప్ రాంచంద్రు నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవికి కనీసం గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమేంటని ప్రశ్నించారు. మరోసారి సీఎం రేవంత్ పై కేటీఆర్ ఇలాగే మాట్లాడితే తెలంగాణ సమాజం నాలుక కోసి పారేస్తుందని హెచ్చరించారు.

ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించినా.. కేటీఆర్ కు బుద్ది రావడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవుపలికారు. కేటీఆర్ తన భాషను మార్చుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు తిరగబడడం ఖాయమని ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, రాందాస్ నాయక్ హెచ్చరించారు.