అనుకోకుండా చెడు జరిగినా.. కష్టం వస్తే.. తలపెట్టిన పని చకా చకా జరుగుతూ మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోతే నరదిష్టి తగిలిందని అందుకే ఇలా అన్ని ప్రతి కూలతలు జరుగుతున్నాయని భావిస్తుంటారు. ఏదో తెలియని అదృశ్య శక్తి మనపై పని చేస్తుందని అందుకే అన్ని విధాలుగా ఇబ్బందులు వస్తున్నాయని పెద్దలు చెబుతుంటారు. అసలు దిష్టి అంటే ఏమిటి..అది మనపై ఎలా ప్రభావం చూపుతుంది? మన పూర్వీకులు చెప్పిన పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. . .!
సమాజం ఎంత ఆధునీకరణ జరిగినా.. ఇంకా ప్రజల్లో అదృశ్య శక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండాఏదైనా ఇబ్బంది కలిగినా.. చిన్న పిల్లలు ఏడ్చినా.. చాలు.. పెద్దలు వాడికి దిష్టి తగిలింది.. ముందు దిష్టి తీయించండి.. తాయిత్తులు కట్టించడం.. వంటి ఆచారాలను పాటిస్తుంటాం. నరదిష్టి గురించి వేదాలలో కూడా సమగ్రంగా వివరించారు.
రుషులు తెలిపిన వివరాల ప్రకారం అధర్వణ వేదంలో ప్రతికూల శక్తులు.. దుష్ర్పభావాల నుంచి రక్షణ పొందేందుకు కొన్ని మార్గాలను.. దిష్టి లక్షణాలను పొందుపరిచారు.
దిష్టి లక్షణాలు
ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు.. పసి పిల్లలు అనవసరంగా ఏడ్చినప్పుడు.. చేస్తున్న పనిలో ఆటంకాలు వస్తుంటే ఎవరి చూపు పడిందో కాని అనుకున్నవి అనుకున్నవి జరగకుండా దిష్టి పెట్టారని అంటుంటారు. ఆధ్యాత్మిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఇతరులవైపు చెడు దృష్టితో ఈర్ష్యతో చూస్తే ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఏదో తెలియని అదృశ్య శక్తి పీడిస్తుందనుకొని తాయిత్తులు కట్టించుకుంటారు.
అధర్వణ వేదంలో చేతబడికి సంబంధించి.. హానికకరమైన మంత్రాలు.. కట్టడి మంత్రాలు.. చెడు జరుగుతుంటే ఏం చేయాలి అనే విషయాల గురించి వివరించారు. ఇతరులకు చెడు చేయాలని తాంత్రిక శక్తి ప్రయోగించే వారిని ఎలా కట్టడి చేయాలి.. ఆ శక్తిని ఎలా నిర్వీర్యం చేయాలో అధర్వణ వేదంలో పండితులు వివరించారు.
నిప్పు.. మంట.. అగ్ని ఎలా అన్ని వస్తువును ఆహుతి చేస్తుందో.. తాంత్రిక శక్తులను .. దైవిక శక్తి నాశనం చేస్తుంది. అయితే అలాంటి దైవిక శక్తి ఉపయోగించే వారు ఆచరించాల్సిన కొన్ని కట్టుబాట్లు.. నియమాలను అధర్వణ వేదంలో వివరించారు.
నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది' అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది.
దిష్టి తీయడమనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.సాధారణంగా ప్రతికూల శక్తి ఇతరుపై ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి అసూయ, కోపం , ప్రతికూల ఆలోచనలతో ఇతరులను చూసినప్పుడు.. అది ఎదుటి వ్యక్తుల మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనినే కొందరు దిష్టిగా పరిగణిస్తారు.
దిష్టి - నివారణ మార్గాలు
ఇప్పటికి కూడా సమాజంలో చిన్న పిల్లలకు నల్ల తిలకం పెడతారు. ఇంటి ముందు నిమ్మకాయలు.. మిరపకాయలు వేలాడదీస్తారు. ఇలా చేయడం వలన చెడు దృష్టి ఇంట్లోకి ప్రవేశించదని నమ్ముతుంటారు.
దృష్టి దోషం, చెడు చూపు, దయ్యం చూపు, దిష్టికి విరుగుళ్ళు గా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్ల తాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ, తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ, కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ, చంటి బిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క, పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క, మెడలో తావీజు... పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు.
ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే, ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు, దిష్టి తగిలిన వాళ్లు ఇబ్బందిపడుతూనే ఉంటారు.
నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం వంటివి చేస్తుంటారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
