- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ మేరకు షెడ్యూల్‌తో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం..రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి సాధారణ బదిలీల నుంచి మినహాయింపునిస్తూ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. అయితే, చెక్‌పోస్టులు, ఎక్సైజ్ అకాడమీ, ధూల్‌పేట వంటి సున్నితమైన ప్రాంతాల్లో పనిచేసే వారికి ఏడాది సర్వీసునే ప్రామాణికంగా తీసుకున్నారు. మార్చి 31, 2027లోపు పదవీ విరమణ చేసే వారికి బదిలీల(కోరుకుంటే తప్ప) నుంచి వెసులుబాటు కల్పించారు. ఈ బదిలీల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ నెల 4వ తేదీలోపు ఖాళీల జాబితాను ప్రకటించనున్నారు.
ఉద్యోగులు తమ ఆప్షన్లను 7 వ తేదీలోపు సమర్పించాల్సి ఉండగా, 10వ తేదీన తుది బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి. భార్యాభర్తల కేసులకు, వితంతువులకు, మానసిక వికలాంగులైన పిల్లలున్న వారికి క్యాన్సర్, కిడ్నీ మార్పిడి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
