తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోంది.. ఏపీ మంత్రి

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోంది.. ఏపీ మంత్రి
  • ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాం
  • మేం నిబంధనల ప్రకారం చేస్తుంటే తప్పెలా అవుతుంది ?
  • అదనంగా చుక్కనీరు తీసుకోవడంలేదు: మంత్రి అనిల్ యాదవ్

అమరావతి: కృష్ణ, గోదావరి నదీ జలాల వివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలను ఎగదోస్తున్నాయి. పరస్పరం చేసుకుంటున్న ఫిర్యాదులను పరిశీలిస్తే ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు మరింత జటిలం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ బహిరంగంగా స్పందించి తెలంగాణనే అక్రమ ప్రాజెక్టులు కడుతోందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. తప్పు చేస్తే భవిష్యత్తులోనూ ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తుంగభద్ర నదిలపై జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని సుంకేశుల వద్ద తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు సక్రమమైందా? అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్  ప్రశ్నించారు. మీరు చేస్తే తప్పు లేదు... మేం నిబంధనల ప్రకారం చేస్తే తప్పా? అంటూ మండిపడ్డారు.

ఏపీలో ఎక్కడా అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం లేదని పునరుద్ఘాటించారు. కృష్ణా నది నుంచి మా వాటాకు సరిపడా నీరు తీసుకునేందుకే వీలుగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడతుతున్నామని చెప్పారు. చట్టాలకు లోబడే రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, ఏపీకి కేటాయించిన నీటి వాటాను ఎక్కడా అతిక్రమించలేదని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 881 అడుగులు పైబడి ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకునే వీలుంటుందని మంత్రి గుర్తు చేశారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 848 అడుగులుంటే చుక్కనీరు తీసుకోలేని పరిస్థితి ఉంటుందని తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటే పొందగలిగే పరిస్థితి ఉందని, అందుకే పోతిరెడ్డిపాడు వద్ద ఇంకో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే  తప్పెలా అవుతుందో తెలంగాణ ప్రభుతవం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 
తెలంగాణ 6 టీఎంసీల ప్రాజెక్టులను కడుతోంది
తెలంగాణ ప్రభుత్వమే  6 టీఎంసీల ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 800 అడుగులకు చేరినా ప్రాజెక్టులో నీరు తరలించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలిపారు. ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోనూ లిఫ్టు ఏర్పాటు చేశారని వివరించారు. సీఎం జగన్ తెలంగాణ ప్రభుత్వానికి స్నేహ హస్తం అందించినా ఉపయోగం లేకుండా పోయిందని, నీటి వాటాలపై ఐదేళ్లుగా తాము పోరాడుతూనే ఉన్నామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.