- ఆయా శాఖల నుంచి ఆర్థిక శాఖకు అందిన వివరాలు
- ప్రభుత్వం దగ్గరున్న లెక్కలకు మించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు?
- సంబంధిత శాఖలో ఒక్కరిద్దరు నమోదు కాకపోయినా మొత్తం శాలరీలకు బ్రేక్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యకు సమానంగా టెంపరరీ ఉద్యోగులు పని చేస్తున్నారు. అన్ని శాఖల నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ సేకరించిన తాజా వివరాల ప్రకారం ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులు 5,21,692 మంది ఉండగా, తాత్కాలిక ఉద్యోగులు(కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తదితర) కూడా 5 లక్షలకు పైగా ఉన్నారని తేలింది. అంటే ప్రభుత్వం తన పరిపాలనా అవసరాల కోసం దాదాపు సగం మంది తాత్కాలిక ఉద్యోగులపై ఆధారపడుతోందని స్పష్టమవుతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ వరకు ఇలా రెగ్యులర్, టెంపరరీ ఉద్యోగులు సమాన సంఖ్యలో ఉన్నారు.
కొన్ని శాఖల్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే ఔట్‌సోర్సింగ్ సిబ్బందే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 31 ప్రభుత్వ శాఖలకుగాను, 9 శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య కంటే తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ శాఖలు అత్యధిక మంది ప్రజలకు సేవలు అందించేవే కావడం విశేషం.
వీటిలో టెంపరరీ ఉద్యోగులే ఎక్కువ
పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ శాఖలో రెగ్యులర్ సిబ్బంది 27,266 మంది కాగా, తాత్కాలిక సిబ్బంది 94,179 మంది ఉన్నారు. అంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నారు. గ్రామ స్థాయి పరిపాలన, గ్రామీణాభివృద్ధి పథకాల అమలుకు తాత్కాలిక నియామకాలపైనే ప్రభుత్వం ఆధారపడుతున్నట్లు ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది.
ప్రజారోగ్యం, వైద్య సేవల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోనూ రెగ్యులర్ ఉద్యోగులు 35,903 మంది కాగా, తాత్కాలిక ఉద్యోగులు 60,934 మంది ఉన్నారు. పట్టణ ప్రాంత పాలనా వ్యవహారాలకు సంబంధించిన మున్సిపల్ శాఖలోనూ టెంపరరీ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ రెగ్యులర్ ఉద్యోగులు17,436 మంది కాగా, తాత్కాలిక ఉద్యోగులు 62,913 మంది ఉన్నారు. ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్డ్, సీనియర్ సిటిజన్స్ శాఖలో రెగ్యులర్ సిబ్బంది 2,801 మంది మాత్రమే ఉండగా, తాత్కాలిక సిబ్బంది ఏకంగా 60,492 మంది ఉన్నారు.
ప్రభుత్వం దగ్గరున్న లెక్కలకు మించి..
ఆర్థిక శాఖ దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో 4.93 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో చాలా వరకు బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు భావించిన ప్రభుత్వం, వారందరి వివరాలను ఆధార్‌తో అప్డేట్ చేయాలని ఆదేశించింది. అప్ డేట్ చేస్తేనే ఈ నెల జీతాలు జమ చేస్తామని ఈ మేరకు ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. దీంతో అందరూ వివరాలను అప్డేట్ చేయగా, ఈ సంఖ్య కాస్తా ఇంకో 20 వేలకుపైగా పెరిగి, 5 లక్షలు దాటింది. అయితే, గ్రామాల్లో పని చేసే మల్టీపర్పస్ఉద్యోగులు లిస్టులో చేరడం వల్లే ప్రభుత్వం అనుకున్న దానికంటే సంఖ్య పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
కొన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వివిధ ప్రభుత్వ సంస్థల్లో బోగస్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉండొచ్చని భావించినప్పటికీ ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. బోగస్ ఉద్యోగులను గుర్తించేందుకు ఇంకాస్త టైం పడుతుందని అంటున్నారు. కాగా, ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తే బోగస్ఉద్యోగులకు చెక్‌పెట్టవచ్చని పేర్కొంటున్నారు.
రెగ్యులర్ ఉద్యోగుల లెక్కలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య 5,21,692 కాగా.. అత్యధికంగా రెగ్యులర్ ఉద్యోగులు ఉన్న పది శాఖలలో సెకండరీ ఎడ్యుకేషన్ 1,17,167 మంది ఉద్యోగులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత హోం శాఖకు 82,424 , ఎనర్జీకి 73,171, ట్రాన్స్‌పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కు 43,757, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కు 35,903, పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ కు 27,266 , రెవెన్యూకు 25,006, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ కు 17,436, హయ్యర్ ఎడ్యుకేషన్ కు16,177, ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ కు12,494 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, అతి తక్కువ మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్న ఐదు శాఖల్లో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కు నలుగురు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కు 64 , లెజిస్లేచర్ కు 249, హౌసింగ్ కు 444 మంది ఉద్యోగులు ఉన్నారు.
టెంపరరీ ఉద్యోగుల్లో పంచాయతీరాజ్ టాప్
తాత్కాలిక ఉద్యోగులను అత్యధికంగా ఉపయోగించుకుంటున్న శాఖల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే విభాగాలు ఉన్నాయి. మొత్తం తాత్కాలిక సిబ్బందిలో అత్యధికంగా పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ శాఖ 94,179 మందితో ముందుంది. తరువాత సెకండరీ ఎడ్యుకేషన్ కు 78,146, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కు 62,913, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కు 60,934, ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కు 60,492 మంది టెంపరరీ ఉద్యోగులు ఉన్నారు. అతి తక్కువ మంది తాత్కాలిక సిబ్బంది ఉన్న శాఖల్లో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కు నలుగురు, ప్లానింగ్ కు184, హౌసింగ్ కు 289, ఫైనాన్స్ కు 540 మంది ఉన్నారు.
మంత్రులు, ఐఏఎస్ పేషీల సిబ్బందిపై తర్జనభర్జన
మంత్రులు, ఐఏఎస్ ల పేషీల్లో టెంపరరీ పద్ధతిలో ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా ఎలాంటి జీవోలు, మెమోలు లేకపోవడంతో ఆర్థిక శాఖ పోర్టల్‌లో వారి వివరాలను తీసుకోవడం లేదని తెలిసింది. దాదాపు 400 మంది టెంపరరీ ఉద్యోగులు మినిస్ట్రీయల్, ఐఏఎస్ చాంబర్లలో పని చేస్తున్నారు. వీరికి శాలరీల చెల్లింపుల విషయంలోనూ భారీగానే ఉన్నట్లు తెలిసింది. దాదాపు రూ.100 కోట్ల వరకు నెలకు చెల్లింపులు చేస్తున్నారు. ఆర్థిక శాఖ పోర్టల్ లో కొందరు టెంపరరీ ఉద్యోగుల ఆధార్ వివరాలు అప్డేట్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీంతో ఆ శాఖ పద్దు కింద టెంపరరీ ఉద్యోగులకు జరిగే శాలరీల చెల్లింపులు మొత్తం కూడా ఆర్థిక శాఖ నిలిపివేసింది. దీనిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గ్రాంట్ ఇన్ఎయిడ్, యూనివర్సిటీలు, సొంత ఆదాయం నుంచి జీతాలు చెల్లింపులు చేసేలా ఉన్న ప్రభుత్వ సంస్థల్లోని టెంపరరీ ఉద్యోగుల విషయంపై త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
