నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా సహకారంతో.. సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా సహకారంతో.. సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా సహకారంతో మే 10, 11 తేదీల్లో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. దీన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో పాల్గొన్న రైతులకు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల పారా లీగల్ వాలంటీర్లు వివిధ వ్యవసాయ చట్టాలపై, వారి హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి,తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ పి నవీన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు వేదికలలో 67 అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
 
రైతులకు న్యాయపరమైన అవగాహన కల్పించడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను గురుంచి వివరించిన న్యాయమూర్తి.. వివిధ వ్యవసాయ చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై లోతైన అవగాహన పొందడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ట్రైనీ వాలంటీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అథారిటీ మెంబర్ సెక్రటరీ, ఎస్ గోవర్ధన్ రెడ్డి, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, లీగల్ సర్వీసెస్ స్కీమ్‌లు, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లలో నియమించబడిన పారా లీగల్ వాలంటీర్ల పాత్ర, వారి విధులపై శిక్షణ పొందిన వారికి అధికారులు అవగాహన కల్పించారు.