హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మణికొండ జాగీర్ గ్రామంలో సిలికాన్ హైట్స్ కోసం 2001లో సేకరించిన 6.22 ఎకరాల భూ వివాదంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను సోమవారం హైకోర్టు తిరస్కరించింది. 2023లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించలేమంది. అత్యవసర నిబంధన కింద సేకరించిన భూ యజమానులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని, లేదంటే భూసేకరణ ప్రక్రియ చేపట్టి పరిహారం చెల్లించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
సిలికాన్ హైట్స్ నిమిత్తం చేపట్టిన భూసేకరణపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టి, ఉత్తర్వులిచ్చింది. 2023 ఎన్నికలు రావడంతో అప్పీళ్లు దాఖలు చేయలేకపోయామని కలెక్టర్ చెబుతున్న కారణం సహేతుకంగా లేదని, దీంతో ఆమోదించలేమంది. ప్రభుత్వానికి న్యాయ సలహాలు, పరిమితులు చెప్పడానికి అధికారులు ఉంటారని, ఎన్నికల కారణంగా జాప్యం జరిగిందన్న కారణాన్ని ఆమోదించలేమంటూ అప్పీళ్లను కొట్టివేసింది.
