హైదరాబాద్, వెలుగు: పత్రికా జర్నలిస్ట్‌ల అక్రిడిటేషన్ కార్డుల జారీలో వర్గీకరణ చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఏబీసీడీలుగా విభజించడం చెల్లదని తెలిపింది. జీవో 230లో షెడ్యూలు–(ఇ)లోని నిబంధన చెల్లదని తీర్పు వెలువరించింది. ప్రభుత్వం 2 నెలల్లోగా చిన్న పత్రికలకూ అక్రిడిటేషన్ ప్రయోజనాల కల్పనకు వీలుగా పారదర్శకంగా, సహేతుకమైన గైడ్‌లైన్స్ తయారు చేయాలని ఆదేశించింది.
అక్రిడిటేషన్ జారీకి సంబంధించి 2016లో జారీ చేసిన జీవోలోని నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన టి.కృష్ణ ఇతరుల పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పింది. పిటిషనర్ లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. ఆ నిబంధనల వల్ల చిన్నపత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ప్రయోజనాలు అందడం లేదని తెలిపారు. దీనిపై హైకోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది.
