సౌర గిరి జలవికాసం స్కీమ్‌‌‌‌కు మాచారం ఎంపిక .. మే 19న ప్రారంభించనున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

సౌర గిరి జలవికాసం స్కీమ్‌‌‌‌కు మాచారం ఎంపిక .. మే 19న ప్రారంభించనున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
  • పోడు పట్టాల కోసం గతంలో జైలుకు వెళ్లిన చెంచులు
  • అదే గ్రామ్‌‌‌‌లో స్కీమ్‌‌‌‌ ప్రారంభించడం పట్ల ఆనందంలో గ్రామస్తులు

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం కింద నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌ మండలం మాచారం గ్రామాన్ని ఎంపిక చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోడు పట్టాల కోసం పోరాడి, కేసుల్లో ఇరుక్కొని జైలుపాలైన తమ గ్రామంలో ప్రభుత్వమే బోర్లు వేయించి, పండ్ల మొక్కలు నాటి పట్టాలు ఇస్తుండడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నెల 19న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్వయంగా వచ్చి 26 మంది చెంచులకు పథకాన్ని అందజేయనున్నారు. 

మాచారంలో ప్రారంభం

ఐదేండ్లలో రూ.12,600 కోట్లు ఖర్చు చేసి, ఆరు లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చి 2.10 లక్షల మంది చెంచులు, ఆదివాసీలు, గిరిజనులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరా లేని అటవీ, మైదాన ప్రాంతాల్లో బోర్లు వేసి సౌర విద్యుత్‌‌‌‌‌‌‌‌ మోటార్లు, పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభానికి ప్రభుత్వం మాచారం గ్రామాన్ని ఎంపిక చేసింది. ఈ గ్రామంలో 55 చెంచు కుటుంబాలు ఉండగా.. మొదటి విడత కింద 26 మందిని ఎంపిక చేశారు. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద రూ. లక్షల విలువైన బోర్‌‌‌‌‌‌‌‌, పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌, స్ప్రింక్లర్‌‌‌‌‌‌‌‌, డ్రిప్‌‌‌‌‌‌‌‌ అందించనున్నారు. 

ఇద్దరికి కలిపి ఓ బోర్‌‌‌‌‌‌‌‌ వేయిస్తున్న ఆఫీసర్లు.. గ్రామంలో ఇప్పటివరకు 16 బోర్లు వేయించారు. సోలార్‌‌‌‌‌‌‌‌ ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌, మోటర్లు, పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు నాటారు. సోమవారం స్కీమ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి వస్తుండడంతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌‌‌‌‌‌‌‌ వంశీకృష్ణ, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ బదావత్‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌, డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో రోహిత్‌‌‌‌‌‌‌‌ గోపిడి ఇతర ఆఫీసర్లు వారం రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఆనందంలో గ్రామస్తులు

మాచారం గ్రామంలోని చెంచులు 2021 జూలైలో అటవీ భూములు దున్నుతున్నారని సమాచారం తో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, చెంచుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ సిబ్బందిపై పెట్రోల్‌‌‌‌‌‌‌‌ పోశారంటూ చెంచులపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో ఉన్న ఉడుతనూరి నిరంజన్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్య చేసుకోగా, అతడి భార్య లింగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఉడుతనూరి మల్లయ్య, పార్వతమ్మ, కాట్రాజు అనిత బెయిల్‌‌‌‌‌‌‌‌పై బయటకు వచ్చారు. చెంచులపై ఉన్న కేసులను కొట్టేస్తున్నామని చెప్పిన గత ప్రభుత్వం ఆ తర్వాత వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.