
న్యూఢిల్లీ: మన దేశంపై వ్యతిరేక వైఖరి అవలంబిస్తోన్న దేశాలకు భారత్ తగిన రీతిలో బుద్ధి చెబుతోంది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఆ దేశానికి మద్దతుగా నిలిచిన టర్కీ, అజార్ బైజాన్ దేశాలపై ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మన సరిహద్దు దేశం బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ ఇచ్చింది భారత్. ఇటీవల సమయం దొరికినప్పుడుల్లా ఏదో ఒక రూపంలో బంగ్లాలోని యూనస్ ప్రభుత్వం భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతోంది. దీంతో బంగ్లాపై భారత్ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉండగానే.. భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ బంగ్లా పరోక్షంగా దాయాది దేశానికే అండగా నిలిచింది.
దీంతో చిర్రెత్తిపోయిన భారత్.. ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని ఫిక్స్ అయ్యింది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ నుంచి వచ్చే దిగుమతులపై తాజాగా ఆంక్షలు విధించింది. ఆ దేశం నుంచి భారత్‌కు దిగుమతి అవుతోన్న రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ఇతర వస్తువులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) శనివారం (మే 17) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆంక్షల ప్రకారం.. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తుల దిగుమతి కోల్‌కతా, నవా షెవా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు.
ఈశాన్యంలోని ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపైన భారత్ బ్యాన్ విధించింది. వీటిలో రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్బోనేటేడ్ పానీయాల వంటి ఉన్నాయి. అయితే.. బంగ్లాకు భారత్ చిన్న మినహాయింపు ఇచ్చింది. భారత్ గుండా భూటాన్, నేపాల్‌కు బంగ్లాదేశ్ రవాణా చేసే వస్తువులకు ఈ ఆంక్షలు సడలించింది. ఇప్పటికే ఆర్ధిక, రాజకీయ సంక్షోభంతో కొట్టామిట్టాడుతోన్న బంగ్లాకు భారతా తాజా నిర్ణయం.. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది.
కాగా, దేశ అంతర్గత రాజకీయ కలహాలతో షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల అనంతరం ప్రాణాలకు ముప్పు ఉండటంతో షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. హసీనా సర్కార్ కూలిపోవడంతో నోబెల్ శాంతి అవార్డు గ్రహీత యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.
షేక్ హసీనా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించగా.. ఆమె తర్వాత ఏర్పడ్డ యూనస్ ప్రభుత్వంపై భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. మన శత్రువులు చైనా, పాక్‌తో అంటకాగుతుంది. దీంతో భారత్, బంగ్లా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. బంగ్లా తాత్కలిక ప్రధాని యూనస్ ప్రత్యక్షంగా భారత్‌పై విమర్శలు కూడా చేయడం గమనార్హం. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | ప్రారంభానికి ముందు కాదు.. తర్వాతే పాక్‌కు చెప్పాం: రాహుల్ వ్యాఖ్యలకు విదేశాంగ శాఖ క్లారిటీ