
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే పాక్‌కు సమాచారం అందించామని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.. దాడులకు ముందే ఇలా శత్రు దేశాలకు సమాచారం ఇవ్వడం నేరం. జైశంకర్ వ్యాఖ్యల వల్ల ఎన్ని భారత యుద్ధ విమానాలకు నష్టం జరిగిందో చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఆయన కామెంట్స్‌కు క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్‌పై మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరణ ఇచ్చింది.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా చేపట్టిన దాడులకు ముందు పాక్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత పాక్‌ను హెచ్చరించారని ఎంఈఏ స్పష్టతనిచ్చింది. అది కూడా తమ దాడుల లక్ష్యం ఉగ్రవాదులు, వారి స్థావరాలేనని.. పాక్ భూభాగంపై కానీ, పాక్ సైనిక స్థావరాలపై కానీ దాడులు చేయట్లేదని వారికి సమాచారం అందించారని పేర్కొంది.
►ALSO READ | ప్రపంచం ఆశ్చర్యపోయింది.. పాక్ భయంతో వణికిపోయింది: అమిత్ షా
కానీ దీనిని ఆపరేషన్ మొదలు పెట్టకముందే చెప్పినట్లుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ గురించి భారతదేశం పాకిస్తాన్‌కు ముందే సమాచారం ఇచ్చిందని జైశంకర్ చెప్పారనే వాదనలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా ఖండించింది. ఈ మేరకు PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి జైశంకర్ అలాంటి ప్రకటన చేయలేదని, ఆయన ప్రకటన తప్పుగా అర్థం చేసుకుంటున్నారని క్లారిటీ ఇచ్చింది.