ప్రపంచం ఆశ్చర్యపోయింది.. పాక్ భయంతో వణికిపోయింది: అమిత్ షా

ప్రపంచం ఆశ్చర్యపోయింది.. పాక్ భయంతో వణికిపోయింది: అమిత్ షా

గాంధీనగర్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. శనివారం (మే 17) అమిత్ షా తన సొంత రాష్ట్రం గుజరాత్‎లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడికి ప్రధాని మోడీ ఇచ్చిన తగిన సమాధానం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని, భారత ప్రతిదాడులతో పాకిస్తాన్‌ భయభ్రాంతులకు గురైందన్నారు. భారత సాయుధ దళాలు పాకిస్తాన్‎లో 100 కి.మీ.ల లోపలి వరకు వెళ్లి దాడులు చేసి ఉగ్రవాదులకు చెమటలు పట్టించాయన్నారు. 

పాకిస్థాన్‎లో ఉగ్రవాదుల కంచుకోట సియాల్‌కోట్, ఇతర ఉగ్రవాద శిబిరాల్లో దాక్కున్న టెర్రరిస్టుల నుంచి అంతమొందించి.. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని అన్నారు. ఇకపై భారత్‎పై ఏదైనా ఉగ్రదాడి జరిగితే.. ప్రతిస్పందన రెండింతలు బలంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‎లో భాగంగా పాకిస్తాన్‌లోని జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలను నేలమట్టం చేశామని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే, వారు దాక్కునే 9 స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు. 

►ALSO READ | ఆపరేషన్ సిందూర్ గురించి పాక్కు ముందే ఎందుకు చెప్పారు: రాహుల్ గాంధీ

తమ వద్ద అణు బాంబులు ఉన్నాయని పాక్ భారత్‎ను బెదిరించే ప్రయత్నం చేసింది. పాక్ ఉడత ఊపులకు మేం భయపడతామని భావించారు. కానీ, మన సైన్యం, నేవీ, వైమానిక దళం వారికి తగిన సమాధానం ఇచ్చాయన్నారు. ప్రపంచం మొత్తం భారత సైన్యం యొక్క సహనాన్ని,  ప్రధాని మోడీ దృఢ నిశ్చయంతో కూడిన నాయకత్వాన్ని ప్రశంసిస్తోందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత భారత దళాలు పాకిస్తాన్ లోపల 100 కి.మీ. దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి అని అమిత్ షా పేర్కొన్నారు.