
- స్లోగా ధాన్యం కొనుగోళ్లు .. అకాల వర్షాలతో దినదినగండంగా గడుపుతున్న రైతులు
- రెండున్నర లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ..
- ఇప్పటి వరకు 1,44,537టన్నుల కొనుగోలు
- 1368 రకం వడ్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్న మిల్లర్లు
- మిల్లర్ల తీరుతోనే ఆలస్యమవుతుందంటున్న ఆఫీసర్లు
ఖమ్మం, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేసేందుకు ఆలస్యమవుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాలవర్షాల కారణంగా ధాన్యం త్వరగా అమ్మేందుకు ఎదురుచూస్తున్న రైతులు దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. తేదీలు మారుతున్నా వడ్ల కాంటాలు కాకపోవడం, కాంటా అయినా బస్తాలు తరలింపు ఆలస్యం కావడంతో ఆయా కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒకవైపు అధికారులు సహా మంత్రులు తడిచిన ధాన్యాన్ని గింజలేకుండా సేకరిస్తున్నామని, ఆయా కేంద్రాల్లో ఆలస్యం లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.
నేలకొండపల్లి మండలం అనాసాగరం కొనుగోలు కేంద్రంలో దాదాపు 20 రోజుల నుంచి కొనుగోళ్లు నెమ్మదిగా జరగడం, కాంటాలు వేసిన ధాన్యం కూడా తరలించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అకాల వర్షాల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. అయితే రైతులు తీసుకువచ్చిన 1368 రకం ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు ఒప్పుకోవడం లేదని, అందువల్లే ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రెండు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నా, కనీసం రెండు వారాల సమయం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్ల దగ్గర ట్రక్ షీట్లలో ఆలస్యమే పేమెంట్ల లేట్ కు కారణమని ఆపీసర్లు అంటున్నారు.
1,44,537 టన్నుల ధాన్యం కొనుగోలు..
జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 351 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 288 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్ లో రెండున్నర లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు మొత్తం 18,977 రైతుల నుంచి 1,44,537 టన్నులు కొనుగోలు చేశారు. సేకరించిన ధాన్యం విలువ రూ.334.03 కోట్లు కాగా, రైతులకు రూ.270.04 కోట్లు చెల్లించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యంలో 77,890 టన్నులు సన్నాలు కాగా, ఏ గ్రేడ్ ధాన్యం 3,728 టన్నులు, దొడ్డు రకం ధాన్యం 62,918 టన్నులు సేకరించారు.
సన్నాలు అమ్మిన 8,148 మంది రైతులకు 63,9310.40 క్వింటాళ్లకు గాను రూ.31.96 కోట్లు బోనస్ రూపంలో బ్యాంకు అకౌంట్లలో జమ చేశారు. ఇక జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు పది సార్లకు పైగా వర్షం పడింది. దీంతో ప్రతిసారి కొనుగోలు కేంద్రాల్లో కొన్ని వందల బస్తాల ధాన్యం తడుస్తోంది. అప్పటికే కాంటాలు వేసిన వడ్లు కూడా తడుస్తుండడంతో, మళ్లీ వాటిని ఆరబెట్టి కాంటాలు వేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
రెండు వారాలైనా డబ్బులు జమకాలేదు
ఏడెకరాల్లో వరి సాగుచేశాను. పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గత నెలలో 405 బస్తాలు కాంటాలు వేసి, వారం రోజుల తర్వాత ఈనెల 2న మిల్లుకు తరలించారు. ఇప్పటి వరకు నా బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. - బి. వెంకటరెడ్డి, గురువాయిగూడెం, కూసుమంచి మండలం
కాంటాలు అయ్యాక తడవడంతో అదనపు ఖర్చు
ఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. 365 బస్తాల ధాన్యాన్ని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కు గతనెల 20న తీసుకొచ్చాను. వారం రోజుల పాటు ఆరబెట్టాను. తేమశాతం వచ్చిన వారం తరువాత కాంటాలు వేశారు. కాంటాలు వేసి వారం పది రోజులు కావస్తున్నా బస్తాలు ఎత్తడం లేదు. వర్షంలో తడవడం వల్ల బస్తాల్లోని ధాన్యాన్ని తిరగేస్తే రూ.2 వేల ఖర్చు వచ్చింది. సెంటర్ నిర్వాహకుల తీరు వల్ల రైతులు అనేక ఇబ్బంది పడుతున్నారు. మన్నె కోటేశ్వరరావు, రైతు, నేలకొండపల్లి
1368 రకం ధాన్యంతోనే సమస్య
ధాన్యం కొనుగోళ్లు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. నేలకొండపల్లి, కూసుమంచి, సత్తుపల్లితో పాటు ఇంకా కొన్ని మండలాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తోంది. 1368 రకం ధాన్యం విషయంలో అన్ లోడ్ చేసుకునేందుకు మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. మిగత ఏ రకం ధాన్యంతో ఎలాంటి సమస్యలు లేవు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. చందన్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి