రాష్ట్ర కేబినెట్ లో మరో మంత్రి చేరబోతున్నారు. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు అజారుద్ధీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొదలైన నేతలు ఇప్పటికే నిర్ధారించారు.
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపడంతో శుక్రవారం (అక్టోబర్ 31) అజారుద్ధీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అజారుద్దీన్‌కి హోం లేదా మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు.
అయితే అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వటమేంటని ఫిర్యాదులో పేర్కొంది.
మైనారిటీ వర్గాలకు మంత్రి పదవి ఇస్తామంటే బీజేపీకి అభ్యంతరమెందుకని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అజారుద్ధీన్ హైదరాబాద్ వ్యక్తి .. మంచి క్రికెటర్.. ఇండియా టీమ్ కు ప్రాతినిథ్యం వహించారు.. దేశానికి సేవ చేశారు.. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తుంటే అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు.
