 
                                    కుమ్రం భీమ్ అనే పేరును కొమురం భీమ్ అని, కొమరం భీమ్ అని కాకుండా కుమ్రం భీమ్ లేదా కుంరం భీమ్ అని మాత్రమే రాయాలి. అలా రాయడం అక్కడి గోండ్ ఆదివాసీల భాష, ఉచ్ఛారణలో భాగం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆసిఫాబాద్‌ను 'కుమ్రం భీమ్ ఆసిఫాబాద్' జిల్లాగా మార్చడాన్ని కూడా గమనించవచ్చు.
ప్రపంచంలోనే గొప్ప విలక్షణ వ్యక్తిగా చెప్పుకుంటుున్న ‘ధీరశాలి కుమ్రం భీమ్’ అని, ఇటీవల ఆయన 124వ జయంతి సందర్భంగా ప్రధాని మన్‌కీ బాత్‌లో చెప్పారు. భారత దేశానికి, తెలంగాణ ప్రజలకు విముక్తి లభించాలని ఆ కాలంలో ఒక ఇరవై ఏండ్ల ఆదివాసీ యువకుడు రజాకార్లపైకి తిరుగుబాటు ఉద్యమం చేయడం గొప్ప విషయం.
ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీమ్ సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం. అడవుల్లో ఉండే ఆదివాసీలకు ‘జల్- జంగల్- జమీన్’పై అధికారం మాదేనని ఆదివాసీ గోండ్ తెగకు చెందిన కుమ్రం భీమ్ నినదించిన తీరు అద్భుతం.
అయితే తెలంగాణ మలిదశ ఉద్యమ కాలం నుంచి ఇప్పటిదాకా చాలామంది మేధావులు, రచయితలు ఆయన గురించి గొప్పగా రాయడం విశేషమే. ఆయన ఆదివాసీల స్వయంపాలన ఉద్యమానికి పితామహుడే కాక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కూడా. కానీ, భీమ్ గురించి చిన్న చిన్న పొరపాట్లు పునరావృతమౌతున్నాయి. ఆయన గురించి తెలుసుకోవడం అవసరమేననే ఉద్దేశంతో కొద్ది వివరణ ఇవ్వాలని సదుద్దేశ్యంతో ఇది రాస్తున్నాను.
 ఆదివాసీలలో ఎక్కువగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరపడానికి ఇష్టపడరు. కానీ కుమ్రం భీమ్ వంటి యోధుల విషయంలో నిర్వహించడం జరుగుతోంది. ఆయన గొప్ప పోరాట యోధుడు కాబట్టి చాలామంది నేడు జయంతి ఉత్సవాలను సైతం జరపడానికి ముందుకు వస్తున్నారు. ఆయన జయంతి 1901 అక్టోబర్ 22.  భీమ్ ఎడమ భుజంగా చెప్పుకునే కుమ్రం కొండల్ లేదా రౌట కొండల్ జయంతిని కూడా ఇదే రోజున 
సంకెపల్లిలో నిర్వహిస్తారు.
కుమ్రం భీమ్ నైజాం పోలీసుల ఎదురుకాల్పుల్లో 1940 సెప్టెంబర్ 1న మృతి చెందినట్లు వ్యాసకర్తలు రాస్తున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరంలో జీవో నెంబర్ 87 ద్వారా.. 1940 అక్టోబర్ 8న అమరుడైనట్టు నిర్ధారించారు. కానీ, అప్పుడు ఆశ్వయుజ మాసం.
ఆదివాసీల ఆచారాల ప్రకారం ఆశ్వయుజ మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున జోడెన్ ఘాట్‌లో ప్రభుత్వం అధికారికంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదివాసీలు పౌర్ణమి రోజును పవిత్రంగా భావిస్తారు. గనుక ఆరోజు నుంచి వారం రోజులపాటు వర్ధంతి వారోత్సవాలు గిరిజన ప్రాంతాల్లో జరుగుతుంటాయి. కానీ అక్టోబర్ 27 ఆయన వర్ధంతి రోజు కాదు.
కుమ్రం భీమ్ పోరాట విశేషాలను ప్రభుత్వం 1984లో తొలిసారిగా తెరకెక్కించడం జరిగింది. ఐటీడీఏ ఉట్నూరు వారి ఆధ్వర్యంలో అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ఆ సినిమాను నిర్మించారు. అప్పటి పరిస్థితుల్లో విడుదల కాకపోయినా 1991లో ఉత్తమ సందేశాత్మాక చిత్రంగా నంది అవార్డుకు ఎంపికైనది.
ఇరవై ఏండ్ల అజ్ఞాతం వీడిన తర్వాత 2010, జులై 2న ‘కొమరం భీమ్’గా చిత్రం విడుదలకు నోచుకుంది. చిత్రంలో ఒక సన్నివేశంలో... భీమ్ భార్య మాట్లాడుతూ నిజాం నవాబుల అరాచకాల నుంచి ఇక పారిపోదామని ప్రాధేయపడినప్పుడు ‘ఉద్యమంలో గెలిస్తే మనం బతుకుతాం. వచ్చే తరాలు బతుకుతాయి. ఉద్యమం నశిస్తే పోరాట స్ఫూర్తయినా మిగులుతుంది. వెన్నుచూపడం తగదు. వెనుతిరిగేది లేదు’ అని భీమ్ చెప్పడం ఒక గొప్ప సందేశాన్ని భావి తరాలకు గుర్తు చేసినట్టయింది.
- గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపకుడు-

 
         
                     
                     
                    