Megastar: డీప్‌ఫేక్‌పై చిరంజీవి ఫస్ట్ రియాక్షన్.. సైబర్ నేరాలకు భయపడొద్దు.. దీనిపై చట్టాలు తేవాల్సిందే.!

Megastar: డీప్‌ఫేక్‌పై చిరంజీవి ఫస్ట్ రియాక్షన్.. సైబర్ నేరాలకు భయపడొద్దు.. దీనిపై చట్టాలు తేవాల్సిందే.!

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాని ముప్పు కూడా పొంచి ఉందని మెగాస్టార్ చిరరంజీవి అన్నారు. ఇటీవల తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా సృష్టించారని .. ఈ డీప్ ఫేక్ ఎంత ప్రమాదమో చెబుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  తాను ఎదుర్కొన్న  డీఫ్ ఫేక్ వ్యవహారంపై ఇటీవల పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్లానని చెప్పారు.. దీనిపై డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ లు చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలిపారు.  ఈ  డీప్ ఫేక్ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చిరంజీవి వెల్లడించారు.

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ ఐక్యతా దినోత్సవం వేడుకలు హైదరాబాద్‌లో ఉత్సాహంగా జరిగాయి. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమానికి పౌరులు, పోలీసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఐక్యతా పరుగులో సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

 ప్రజలకు అండగా పోలీసులు ..

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'రాష్ట్రీయ ఏక్తా దివస్' వేడుకల్లో భాగం కావడం తనకెంతో గౌరవంగా ఉందని అన్నారు . మన పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని అన్నారు. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారు. ఎవరూ డీప్‌ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పారు. అయితే, పెరుగుతున్న టెక్నాలజీని స్వాగతించాల్సిందే కానీ, దాని దుర్వినియోగంపై ప్రభుత్వాలు దృష్టి సారించి ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్!

మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదుపై స్పందించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్, డీప్‌ఫేక్‌ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని సీపీ కోరారు.  అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ వంటి మోసాలకు ప్రజలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక.. పిల్లలు రూ.5,000, రూ.10,000 కోసం సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారు. దీని వల్ల వారి తల్లిదండ్రులు కూడా కేసుల్లో ఇరుక్కుంటున్నారు సజ్జనార్ వెల్లడించారు.  సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.