 
                                    మానవ సంబంధాల గురించి ఒకప్పుడు చాలా లోతుగా విషయం చెప్పే జ్ఞానులు, మేధావులు ఉండేవారు. ఇప్పుడు ఎవరూ కానరావడం లేదు. వీరి లేని లోటు స్పష్టంగా ఇప్పుడు తెలుస్తున్నది. ఈ మధ్యకాలంలో మానవ సంబంధాలలో విపరీతమైన మార్పు ప్రస్ఫుటమవుతున్నది.
ఈ విపరీతమైన మార్పు పరిణామమే నిత్యం మనం చూస్తున్న మర్డర్లు. మానవ సమాజ చరిత్రలో తోటి మనిషిని చంపడం కొత్త కాదు. అయితే, ఇదివరకు కనపడని అనేక ధోరణులు కొత్తగా చూస్తున్నాం. ఉన్నత కుటుంబాలు, మధ్య తరగతి, పేద కుటుంబాలలో కూడా ఈ రకమైన విపరీతమైన హత్యలు సాధారణం అవుతున్నాయి.
తల్లులు  పిల్లలను,  పిల్లలు తల్లులను హత్య చేయడం ఆధునిక మానవ  సంబంధాలలో ఒక భారీ కుదుపు.  ప్రేమ పేరిట చంపడం,  ప్రేమించినవారిని చంపడం, దాయాదుల పిల్లలతో సహా పసిగుడ్డులను కూడా లక్ష్యం చేసుకుంటున్నారు. సొంత తల్లి దగ్గర నుంచి రక్తసంబంధీకులే లక్ష్యంగా చంపుతున్న సందర్భాలు చూస్తున్నాం.  ఎందుకు చంపుతున్నారనే కారణాలు చూస్తే కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.  మానవ సమాజంలో ఈ రకమైన విపరీత ధోరణులు ఎందుకు వస్తున్నాయి?  దీనిని వెనుక నిగూఢ కారణాలు ఏమిటి?
ఉన్మాద స్థితి
ఆవేశం, ద్వేషం, అసూయ, కక్ష, భయం, స్వార్థం వంటి మానసిక భావాల వల్ల హింసకు పరిస్థితులు దారి తీయవచ్చు. పెరుగుతున్న హత్యల పరంపర మీద సామాజిక అధ్యయనం చేయాల్సిన అవసరం కనపడుతున్నది. గతంలో ఘర్షణలలో ఆర్థిక కారణాలు బలంగా ఉండేవి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని బలంగా నమ్మేవారి సంఖ్య పెరిగింది. ఈ మధ్య జరుగుతున్న నేర సంఘటనలు చూస్తుంటే వాటిలో ఉన్మాదం ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఉన్మాద స్థితిలో మనిషికి విలువలు, విశ్వాసాలు, బంధాలు అడ్డుగా రాలేవు. ఈ ఉన్మాద స్థితికి కారణం ఏమిటి? ఉన్మాదం మానసిక స్థితిలో ఒక విపరీత ఘట్టం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్మాద స్థితికి చేరడానికి అంతర్గత పరిస్థితులు కారణం కావచ్చు. బాహ్య కారణాలు కూడా ఉంటున్నాయి.
కాలుష్యం, అనుచిత ఆహారం, మానసిక అనారోగ్యం కారణాలు
మన దేశంలో మానసిక ఆరోగ్యం మీద దృష్టి ఎవరికీ లేదు. శారీరక ఆరోగ్యంతో మానసిక ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. రెండూ పరస్పర ఆధారంగా నడుస్తాయి. శారీరక అనారోగ్యం కరోనా తరువాత ప్రతి ఇంట్లో తాండవిస్తున్నది. కాలుష్యం, అనుచిత ఆహారం, జీవనశైలి వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుంటే మానసిక పరిస్థితి కూడా ఆ విధంగానే మారుతుంది. అటువంటప్పుడు మానవ సంబంధాలను కలిపే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ముఖ్యం.
శారీరక అనారోగ్యం మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తే మానవ సంబంధాలు ఆదుకుంటాయి. దీర్ఘకాలిక శారీరక అనారోగ్యం వల్ల కుటుంబాల మీద అనేక రూపాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఆయా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం తోటి మనుషుల నుంచే వస్తుంది. అందుకే, ఉమ్మడి కుటుంబాలు ముఖ్యమని చాలామంది భావిస్తారు.
చిన్న కుటుంబాలు, ఒంటరి జీవితాలు బాహ్య వ్యక్తుల మీద ఆధారపడం వల్ల ఇంకా ఇతర సమస్యలు వస్తుంటాయి. తాము ఎదుర్కొంటున్న శారీరక, అనారోగ్య సమస్యలకు హింస వల్ల పరిష్కారం లభిస్తుంది అని భావించే దశకు కొందరు చేరడం దురదృష్టకరం.
ప్రకృతి వ్యతిరేక జీవనశైలి
సామాన్యులు హింసా మార్గం ఎంచుకోవడానికి మనం అనుసరిస్తున్న ప్రకృతి వ్యతిరేక జీవనశైలి కూడా కారణం కావచ్చు. ప్రకృతి ఇచ్చిన వర్షాన్ని నిలువ చేసే అడవులను, గుట్టలను నాశనం చేసి తమ అవసరాలకు కావాల్సిన నీళ్ళు మాత్రం పెద్ద రిజర్వాయర్లలో నిలువ చేసుకుని పైపులైన్ ద్వారా తీసుకుంటున్నారు. చెరువులు, వాగులు, నదుల పరీవాహక ప్రాంతాలను నాశనం చేసి నీటి కరువు సృష్టించుకుని.. బోర్వెల్ ద్వారా భూగర్భ జలాలను తోడుతున్నారు.
ఇతర జీవాలకు అందని ప్రాణధార వనరులను తమకే చెందేవిధంగా ఒక రకంగా హింసాత్మక వ్యవస్థను ‘అభివృద్ధి’ పదం జోడించి పెంచుతున్నారు. అడవులలో ఆహారం, వ్యవసాయ క్షేత్రాలలో పంటలు తమకే అందే విధంగా ‘హింసాత్మక’ పద్ధతులకు ఆస్కారం కల్పించారు. అదే ధోరణి వ్యక్తి నుంచి వ్యవస్థ దాకా పాకి కొందరికి సంపద సృష్టించి అనేకులకు దు:ఖం మిగిల్చి హింసకు అవకాశం కల్పిస్తున్నది మానవాళి. ఈ క్రమంలో హింస, హింసాత్మక ధోరణి సాధారణం అయిపోయింది.
ప్రకృతి మీద హింస ద్వారానే కొన్ని స్వప్రయోజనాలు మానవులు పొందుతున్న క్రమంలో అదే ఫార్ములా తమ మధ్య వ్యాపార, ఆర్థిక, లావాదేవీ సంబంధాలలో ఉపయోగిస్తున్నారు కొందరు. ఈ మధ్య కాలంలో అది కుటుంబ వ్యవస్థకు చేరింది.
భావోద్వేగాలపై రసాయనాల ప్రభావం
కాలుష్యం, అందునా రసాయన కాలుష్యం రకరకాలుగా మన శరీరంలోకి చేరుతుంది. మన అవయవాల మీద రసాయన చర్యలు ప్రభావం చూపుతూ భావోద్వేగాలకు కారణం అవుతున్నాయి. హార్మోన్ల అసమతుల్యత కూడా కొన్ని సందర్భాల్లో హింసాత్మక ప్రవర్తనకు దోహదం చేస్తుంది. ఈ అసమతుల్యత శారీరక, మానసిక, పర్యావరణ కాలుష్యం కారణాల వల్ల ఏర్పడుతుంది.
2022లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అధిక టెస్టోస్టెరాన్, తక్కువ కార్టిసాల్ స్థాయిల వల్ల హింసాత్మక నేరపూరిత ప్రవర్తనకు దారి తీయవచ్చు. పీఎల్ఓఎస్ క్లైమేట్‌లో 2023లో ప్రచురితమైన ఒక అధ్యయనం వరదలు, తుపానులు, కొండచరియలు జారడం వంటి విపత్తుల వల్ల తర్వాత సన్నిహిత భాగస్వామి హింస (ఐపీవీ)లో గణనీయమైన పెరుగుదలను కనుగొంది. ఈ అధ్యయనం 26 సంవత్సరాలలో 156 దేశాల నుంచి డేటాను విశ్లేషించింది.
వాతావరణ విపత్తులు కుటుంబాలలో ఒత్తిడిని తీవ్రతరం చేస్తాయని, హింసాత్మక పరిస్థితులను పెంచుతుందని నిర్ధారించింది. అత్యవసర చర్యలు తీసుకోకపోతే, ఈ శతాబ్దం చివరినాటికి ప్రతి 10 హింసాత్మక కేసులలో ఒకదానికి వాతావరణ మార్పు ముడిపడి ఉంటుందని 2025 యూఎన్ స్పాట్‌లైట్ ఇనిషియేటివ్ బ్రీఫ్ హెచ్చరించింది. మహిళలు, బాలికలపై హింసకు కీలకమైన చోదకాలుగా ఆర్థిక అస్థిరత, స్థానభ్రంశం, ఆహార అభద్రతను గుర్తించింది.
ఉపశమనం
ఆధ్యాత్మికత (స్పిరిట్యువల్) కూడా ఉపశమనం కలిగించవచ్చు. ఏదేమైనా మనకు ఒక సమాజం కావాలి. ఒకప్పటి గ్రామీణ ప్రాంతాలలో ఉండిన సమాజం క్రమంగా కనుమరుగు అవుతున్నది. పట్టణాలలో అయితే ఎవరికివారే యమునా తీరే అన్నట్లు జీవిస్తున్నారు.
ప్రభుత్వం, చట్టాలు అన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూపలేవు. సమ సమాజ నిర్మాణం ద్వారా పర్యావరణ విధ్వంసాన్ని నివారిస్తూ, ప్రకృతితో ఒక సుస్థిర సంబంధం ఏర్పరుచుకుంటూ, వాతావరణ మార్పులను తిరోగమన దిశగా తీసుకుపోవటానికి మనకు ఒక సమాజం కావాలి. మానవ సంబంధాలు శాంతి, సౌభ్రాతృత్వంతో పెరగాలి.
ప్రకృతిలో అన్ని ప్రాణుల జీవన హక్కులను గౌరవించే సమాజం, మానవ సమాజంలో కూడా అందరిని గౌరవంగా చూస్తుంది. కాలుష్య నివారణ, పుడమి తాపాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలు చేరుకోవాలంటే ప్రకృతిని, సాటి మనుషులతో సంబంధాలను పునఃరచించాలి.
వాతావరణ ఉత్పాతాలు
ఒక అధ్యయనం ప్రకారం పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 2090 నాటికి గృహ హింస కేసులు 23.5% పెరుగుతాయని అంచనా. వాతావరణ ఒత్తిళ్లు ఇప్పటికే ఉన్న లింగ అసమానతలను మరింత పెంచుతాయని, మహిళలు హింసకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం నొక్కి చెప్పింది. 2023లోనే 93.1 మిలియన్ల మంది వాతావరణ సంబంధిత విపత్తులు, భూకంపాల బారిన పడ్డారు. అయితే, అదే సమయంలో మిలియన్ల మంది మహిళలు సన్నిహిత భాగస్వామి హింసను అనుభవించారని అంచనా. వాతావరణ ఉత్పాతాలు తరచుగా రావడం, తీవ్రంగా మారుతున్నందున, కుటుంబంలో హింస కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
పర్యావరణ విలువలు - వనరుల నిర్వహణ, పరస్పర అనుసంధానం, స్థిరత్వం, ప్రకృతి పట్ల గౌరవం వంటివి - హింసను తగ్గించడంలో, మానసిక స్థితిస్థాపకతను పెంపొందించడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తాయి. అవి హింసను పూర్తిగా తొలగించకపోవచ్చు. కానీ స్వస్థత, సామాజిక ఐక్యత, భావోద్వేగ నియంత్రణకు మార్గాలను అందిస్తాయి.
- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్

 
         
                     
                     
                    