 
                                    మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. 339 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ ఇచ్చింది. గురువారం (అక్టోబర్ 30) నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ముగిసిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో ఛేజింగ్ చేస్తూ జెమీమా రోడ్రిగ్స్ పోరాడిన విధానం ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తోంది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జెమీమా 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది.
జెమీమా పోరాడిన విధానం గురించి.. భారత విజయంపై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. "ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిపై మన జట్టు సాధించిన విజయం ఇది. అమ్మాయిల అద్భుతమైన ఛేజింగ్ చేసి మ్యాచ్ గెలిచారు. బిగ్ మ్యాచ్ ల్లో జెమిమా చూపించిన పోరాటం అసాధారణం. జట్టుకు సమిష్టి విజయానికి ఇది నిదర్శనం. నిజమైన దృఢత్వం, నమ్మకం, గెలిపించాలనే కసి ఉన్న కారణంగానే ఈ రోజు మనం గెలిచాం. టీమిండియాకు నా అభినందనలు". అని విరాట్ ట్వీట్ చేశాడు.
What a victory by our team over a mighty opponent like Australia. A great chase by the girls and a standout performance by Jemimah in a big game. A true display of resilience, belief, and passion. Well done, Team India! 🇮🇳
— Virat Kohli (@imVkohli) October 31, 2025
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆసీస్ 49.5 ఓవర్లలో 338 రన్స్‌కు ఆలౌటైంది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (93 బాల్స్‌లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119), ఎలైస్ పెర్రీ (88 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), ఆష్లే గార్డెనర్ (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) దంచికొట్టారు. ఇండియా బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్,రాధా యాదవ్ లకు ఒక్కో వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇండియా 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి గెలిచింది.
గతంలో ఏ జట్టుకూ సాధ్యంకాని భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. జెమీమా రొడ్రిగ్స్ (134 బాల్స్‌లో 14 ఫోర్లతో 127 నాటౌట్) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89) దుమ్మురేపడంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 రన్స్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో కంగారూలపై గెలిచి మూడోసారి గ్రాండ్‌గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. 2005, 2017లో ఇండియా టైటిల్ ఫైట్‌కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.

 
         
                     
                     
                    