Women's ODI World Cup 2025: ఓపిక లేదు.. ఆ దేవుడే నన్ను నడిపించాడు: మారథాన్ ఇన్నింగ్స్‌పై జెమీమా కన్నీరు

Women's ODI World Cup 2025: ఓపిక లేదు.. ఆ దేవుడే నన్ను నడిపించాడు: మారథాన్ ఇన్నింగ్స్‌పై జెమీమా కన్నీరు

ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో జెమిమా రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్ ను ఎంత ప్రశంసించినా తక్కువే. మహిళా క్రికెట్ లో ఒక ప్లేయర్ ఇలాంటి మారథాన్ ఇన్నింగ్స్ ఆడడం చాలా అరుదు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అసాధారణంగా పోరాడింది. 134 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 14 ఫోర్లతో 127 పరుగులు చేసి టీమిండియాకు విజయం అందించింది. మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన జెమీమా మ్యాచ్ గెలిచేవరకు క్రీజ్ లోనే ఉంది. షెఫాలీ వర్మ ఔటైన తర్వాత రెండో ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్ 49 ఓవర్ వరకు బ్యాటింగ్ తీసిన తీరు అద్భుతం. 

339 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించలేదు. సంవత్సరం తర్వాత జట్టులోల్కి వచ్చిన షెఫాలీ 10 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ దశలో ఇండియాను ఆదుకునే బాధ్యత స్మృతి మందానతో కలిసి రోడ్రిగ్స్ రెండో వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 24 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన మందాన ఔట్ కావడంతో టీమిండియా 59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అయితే ఇక్కడ నుంచే అసలైన ఆట మొదలయింది. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి జెమీమా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

మొదట ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత క్రమంగా జోరు పెంచారు. అలవోకగా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కౌర్ ఔటైన తర్వాత రోడ్రిగ్స్ బాగా అలసిపోయింది. సింగిల్స్ తోనే ఎక్కువగా పరుగులు తీస్తూ ఓపిక మొత్తం కోల్పోయింది. ఎంత అలసటతో ఉన్నా జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. చివర్లో దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్ జ్యోత్ కౌర్ లతో కీలక భాగస్వామ్యాలు నిర్మించి ఇండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది. 

మ్యాచ్ గెలిచిన తర్వాత జెమీమా రోడ్రిగ్స్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీరు పెట్టుకొని మాట్లాడుతూ ఇలా చెప్పింది. "ముందుగా, నేను జీసస్ కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆయనే నన్ను ముందుకు నడిపించాడు. నేను సొంతగా పోరాడలేకపోయాను. ఆ దేవుడే నన్ను భరించాడు. గత నాలుగు నెలలు చాలా కఠినంగా గడిచింది. ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. నేను నా సెంచరీ, హాఫ్ సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టును గెలిపించాలనే ఆలోచనే నా మైండ్ లో ఉంది. నా పేరెంట్స్ కు కృతజ్ఞతలు. అని జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతం చేసింది. ఆస్ట్రేలియా విధించిన 339 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం (అక్టోబర్ 30) నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ముగిసిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (127) వీరోచిత సెంచరీతో చివరి వరకు క్రీజ్ లో ఉండి టీమిండియాకు విజయాన్ని అందించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48.3 ఓవర్లలో  338 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇండియా 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి గెలిచింది.