CM Revanth Reddy: సల్మాన్ ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. 'తెలంగాణ రైజింగ్' గ్లోబల్ ప్రమోషన్!

CM Revanth Reddy: సల్మాన్ ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. 'తెలంగాణ రైజింగ్' గ్లోబల్ ప్రమోషన్!

తెలంగాణను మరింత అభివృద్ది పథంలో తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.  'తెలంగాణ రైజింగ్' పేరుతో ప్రభుత్వ విజన్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను  సీఎం రేవంత్ రెడ్డి  గురువారం రాత్రి కలిశారు. వీరి భేటీ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. 

 సినీ పరిశ్రమ ద్వారా తెలంగాణ ప్రచారం

ఈ భేటీలో  రాష్ట్రంలో  వేగంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక రంగాలలో వస్తున్న మార్పులను సల్మాన్ ఖాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతున్న తీరును ప్రపంచానికి తెలియజేయాలనే తమ ప్రభుత్వ లక్ష్యాన్ని సీఎం సల్మాన్‌తో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర తారలు తెలంగాణ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించగలరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను సినీ నిర్మాతలు, పెట్టుబడిదారులకు అగ్ర గమ్యస్థానంగా మార్చాలనే తమ ప్రణాళికలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఫిల్మ్ ప్రమోషన్, టూరిజం, పెట్టుబడులు వంటి రంగాలలో కలిసి పనిచేసే అవకాశాల గురించి చర్చించారు.

'తెలంగాణ రైజింగ్‌'ను ప్రచారం చేస్తా!

ఈ సంద్భంగా సల్మాన్ ఖాన్ ముఖ్యమంత్రి విజన్‌ను, నాయకత్వాన్ని ఎంతగానో ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో ఒకటిగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ, ఐటీ రంగాలు వేగంగా వృద్ధి చెందడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు పూర్తిగా మద్దతు తెలిపిన సల్మాన్ ఖాన్, 'తెలంగాణ రైజింగ్' ప్రచారాన్ని తన స్థాయిలో ప్రచారం చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ మద్దతుతో, రేవంత్ రెడ్డి దార్శనికతతో 'తెలంగాణ రైజింగ్' ఇక దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.