అడవిలో అందాల విడిది .. ప్రారంభానికి సిద్ధమైన నర్సాపూర్ ఎకో పార్క్

అడవిలో అందాల విడిది .. ప్రారంభానికి సిద్ధమైన నర్సాపూర్ ఎకో పార్క్
  • రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు ... ఆధునిక 42 కాటేజీలు
  • ఆకట్టుకునేలా స్విమ్మింగ్  పూల్ లు
  • ఆహ్లాదం కలిగించేలా గ్రీనరీ
  • త్వరలో ప్రారంభించనున్న అటవీ శాఖ మంత్రి 

మెదక్/నర్సాపూర్​, వెలుగు: కనుచూపు మేర దట్టమైన అడవి... పచ్చని చెట్లతో  ఆహ్లాదకరమైన వాతావరణం... ఎలాంటి కాలుష్యం లేని స్వచ్చమైన గాలి... పక్షుల కిలకిల రావాలు... నీటి మీద తేలియాడినట్లుండే కాటేజీలు... ఆకట్టుకునే  స్విమ్మింగ్​ పూల్​ లు..  ఇదంతా చెప్తోంటే ఏ కేరళో,  అరుకో అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఇది మన మెదక్ జిల్లాలో రూపుదిద్దుకున్న అందమైన విడిది. 

ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా నర్సాపూర్​ అడవిలో ఏర్పాటుచేసిన ఎకో పార్క్​. హైదరాబాద్​ - మెదక్ నేషనల్​ హైవే ను ఆనుకుని నర్సాపూర్​ పట్టణ శివారులో దట్టమైన అడవి ఉంది. రాష్ట్ర రాజధాని  హైదరాబాద్​కు సమీపంలో ఉండటం, ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుండటంతో దాదాపు ఐదేళ్ల కింద ఇక్కడ ప్రభుత్వం ఫారెస్ట్​ 2.ఓ పథకం కింద రూ.20 కోట్లతో అర్బన్​ పార్క్​ ఏర్పాటు చేసింది.  

ఇది అందుబాటులోకి వచ్చాక సందర్శకుల రాక ఒక్కసారిగా పెరిగింది. చాలా మంది రాత్రి అక్కడ బస చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా, అందుకు అవకాశం లేకపోవడం ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో పీపీపీ విధానంలో రూ.3 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో అందమైన కాటేజీలు నిర్మించారు. ఫారెస్ట్​ ను ఆనుకుని నర్సాపూర్​ రాయరావు చెరువు ఉండగా చెరువు ఒడ్డునే  పిల్లర్లు వేసి ఆధునిక హంగులతో  వీటిని ఏర్పాటుచేశారు.

  చెరువు నిండితే కాటేజీలో నీటిలో తేలియాడుతున్నట్టు కనిపిస్తాయి. బర్త్​ డే, మ్యారేజ్​ డే పార్టీలు, పెళ్లి ముందు నిర్వహించే హల్దీ ఫంక్షన్​,  గెట్​ టు గెదర్​ పార్టీలు నిర్వహించుకునేందుకు వీలుగా కిచెన్, డైనింగ్ హాల్ సౌకర్యంతో ఫంక్షన్ హాల్ నిర్మించారు.  ఆకర్షణీయమైన డిజైన్​ తో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ తో పాటు, పలు కాటేజీల వద్ద చిన్న స్విమ్మింగ్​ పూల్ లను నిర్మించారు.

  కాటేజీల బాల్కనీలో నిల్చుంటే రాయరావు చెరువు నీటి అందాలు కనిపిస్తాయి.  మొత్తం 42 కాటేజీలు నిర్మించగా వాటి ముందు భాగంలో ఆకర్షణీయ మైన క్రోటాన్​లు, పూల మొక్కలు పెంచారు. ప్రాంగణంలో గ్రీనరీ డెవలప్​ చేశారు. పనులన్నీ  పూర్తికాగా త్వరలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఎకో పార్క్​ కాటేజీలను ప్రారంభించేందుకు  అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.