సమగ్ర భారత దార్శనికుడు పటేల్

సమగ్ర భారత దార్శనికుడు పటేల్

స్వతంత్ర భారతదేశానికి మొదటి ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సంబురాల  సమయంలో  ఆ మహోన్నత వ్యక్తి  జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిది.  

తెలంగాణ బిడ్డలుగా  సర్దార్ పటేల్​కి  గౌరవ వందనం చేయడం మన అదృష్టం.  ఆయనే  లేకపోతే హైదరాబాద్​లో భాగమైన మనం ఏ పాకిస్తాన్ ప్రాంతంలోనో  కలపబడి ఉండేవాళ్లం. ఆయన చూపిన ధైర్యం, రాజకీయ చాణక్యం, స్థిరమైన సంకల్పం వల్లనే దక్కన్  ప్రాంతానికి గుండెకాయ  అయిన ఈ హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్​లో అవిభాజ్య భాగంగా నిలిచింది. 

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి మన నేతలు దేశంలో ఉన్న సుమారు 565 సంస్థానాలను ఒక సార్వభౌమ దేశంగా ఏకీకరించే మహత్తరమైన కార్యానికి పూనుకున్నారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఇది విభజిత ఉపఖండంలా ఉంది. ఇది ఒక రాజకీయ పజిల్. దీనిని పరిష్కరించడానికి మొక్కవోని ధైర్యం, అకుంఠిత కార్యదీక్ష కావాలి. 

పటేల్​ కార్యదీక్ష

అప్పటికి చాలా సంస్థానాలు భారత్​లో అంతర్భాగం అయ్యేందుకు అంగీకరించాయి.  కేవలం హైదరాబాద్ సంస్థానం, జునాగఢ్,  కాశ్మీర్ వంటి రాజ్యాల అధినేతలు స్వతంత్రంగా ఉండాలని లేదా పాకిస్థాన్​లో భాగం కావాలని కోరుకున్నారు. కానీ, మన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం భారతదేశ హృదయంలో భాగమైన ఏ ఒక్క స్వతంత్ర రాష్ట్రాన్ని విడిగా ఉంచేందుకు అంగీకరించలేదు. 

భారతదేశ స్వరూపాన్ని,  అఖండమైన సమగ్రతను కాపాడడానికి హైదరాబాద్ భారత యూనియన్ లో ఉండాల్సిందే అని కార్యదీక్ష చేపట్టాడు. అప్పటి నిజాం నవాబు మీర్​ ఉస్మాన్ అలీఖాన్ నేతృత్వంలోని  హైదరాబాద్ మిగిలిన రాష్ట్రాలవలె సాధారణమైన రాష్ట్రం కాదని చెప్పాలి.  ఇది సమృద్ధిగా, స్వావలంబనతో  సొంత కరెన్సీ, సైన్యం, పరిపాలన  కలిగి ఉంది.  

 ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన నిజాం భారత యూనియన్ నుంచి తాను స్వతంత్రంగా ఉండగలనని బలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. కానీ,  భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్  మాత్రం దృఢ సంకల్పంతో  ఏకీకృత భారతంలో హైదరాబాద్ ప్రత్యేకంగా ఉండలేదని స్పష్టం చేశారు. ఆయన దృష్టి కేవలం రాజకీయ పరిమితిలో కాదు ఈ దేశ నాగరికత మూలాలపై ఉంది. ఈ దేశాన్ని ఒకే దేశంగా కలిపి ఉంచడం ఇక్కడి సంస్థానాధీశులు, వారి వంశాలకంటే గొప్ప కార్యమని ఆయన అర్థం చేసుకున్నారు. 

ఆధునిక భారతదేశ రూపకర్త పటేల్​

సర్దార్ పటేల్ అనేక అడ్డంకులను అధిగమించి విభిన్న ప్రాంతాలను ఒక దేశంగా ఏకీకృతం చేశాడు.  మనం ఈరోజు భారతదేశ ఐకమత్యాన్ని ఇంత గొప్పగా జరుపుకుంటున్నాము అంటే  అది సర్దార్ పటేల్ కృషి అని చెప్పుకోవాలి. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చిన  ధైర్యశాలి.  ఇప్పటికీ దేశంలోని కొన్ని శక్తులు ఈ సమగ్రతను వ్యతిరేకిస్తున్నాయి. వీళ్ళు ఆయుధాలు,  బాంబులు, వివిధ ప్రచార మాధ్యమాలు ఉపయోగించి ప్రజలను విభజిస్తున్నారు. 

పటేల్ నిర్మించిన  దేశ సమైక్యతను ప్రశ్నిస్తున్నారు. కానీ,  ప్రధాని మోదీ,  హోంమంత్రి అమిత్ షాల  నాయకత్వంలో  భారతదేశ సమగ్రత అంతర్గత భద్రత వంటి అంశాలు ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాయి. ఉదాహరణకు 2014లో  నక్సలైట్ల ప్రభావం 128 జిల్లాల్లో వ్యాపించి ఉండేది.  అది 2025 నాటికి కేవలం మూడు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. 

2026  మార్చి 30 నాటికి  నక్సలిజాన్ని అంతం చేస్తాం అని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఇది కేవలం గణాంకాల విజయం కాదు. భారత నాగరికత,  దేశ సమైక్యత, శాంతి, స్థిరత్వం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇదో పెద్ద ముందడుగు. 

పటేల్ మార్గంలో పయనిద్దాం

దురదృష్టం ఏమిటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మన పాఠ్యపుస్తకాలలో సరైన స్థానాన్ని, గౌరవాన్ని ఇవ్వలేకపోయాం. చరిత్రను కేవలం ఒక కుటుంబం గౌరవానికి అనుకూలంగా రచించడం, స్వాతంత్ర్యం కోసం పనిచేసిన ఎంతోమంది గొప్ప నాయకుల చరిత్రను  పుస్తకాలలో లేకుండా చేసి  వారిని కనీసం గుర్తించకపోవడం వాస్తవ చరిత్రను కప్పి ఉంచడమే.  

 నెహ్రూ, పటేల్ మధ్యలో ఉన్న అనేక వ్యత్యాసాలను దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయంగా దేశాల మధ్య  భౌగోళిక రాజకీయ అనిశ్చితి  ఏర్పడిన సందర్భంలో  ప్రతి దేశం ప్రత్యక్షంగా,  పరోక్షంగా సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే వివిధ దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో దేశ ప్రజలందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ఏకతా మార్గంలో ప్రయాణించి ఈ దేశ భవిష్యత్తు కోసం ఏకత్వాన్ని పాటించవలసిన అవసరం ఉంది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్​ను గౌరవిస్తూ,  ఆయన  గుండె  ధైర్యాన్ని, దూర దృష్టిని, ఏకీకృత భారతదేశానికై చూపిన అచంచల విశ్వాసాన్ని స్మరించుకుందాం. ఆయన జీవితమే  ప్రేరణగా  ఒక ఆత్మనిర్భర భారతాన్ని, సుస్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం. 

వికసిత భారత్ వైపు అడుగులు

ఐక్యత అనేది కేవలం నినాదాల ద్వారా కాదు... త్యాగం, సంకల్పం, దృఢమైన విశ్వాసం ద్వారా 
సిద్ధిస్తుందని పటేల్ మనకు ఆచరణలో చూపించారు. నర్మదా తీరంలో నిలిచిన ఏకత ప్రతిమ నుంచి మన పాలనకు దారి చూపే  సమైక్యత ఆలోచనలతో  భారతదేశ భవిష్యత్తుకు మన ప్రస్తుత నాయకత్వం రూపకల్పన చేస్తున్నారు. 

ప్రజాస్వామ్యాన్ని బలపరిచేలా అనేక సంస్కరణలు, అనేక ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధి, ఇలా ప్రతి  రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తూ  ఈ దేశ ప్రజల కలలను కేంద్ర  ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. మనం 2047 వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణం సర్దార్ పటేల్ చూపిన ఆదర్శం మార్గదర్శకంగా ఉన్నది.

 ఆయన వారసత్వం కేవలం చరిత్ర కాదు.  మనం ప్రేమించే  దేశం కోసం మనం నిర్మించుకోబోయే భవిష్యత్తుకు పునాది.  త్రివర్ణ పతాకం ఎగురుతున్నంత కాలం సర్దార్ పటేల్ ఆదర్శ జీవితం మనతో  కొనసాగుతూనే ఉంటుంది. అది రాజ్యాంగాన్ని పాటించే  ప్రతి భారతీయుడి హృదయాలలో మనకు కనిపిస్తూనే ఉంటుంది.

‌‌ 

- ఎన్. రామచందర్ రావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -