దరఖాస్తులు దండిగా..రెవెన్యూ సదస్సులకు పోటెత్తుతున్న అర్జీలు

దరఖాస్తులు దండిగా..రెవెన్యూ సదస్సులకు పోటెత్తుతున్న అర్జీలు
  • భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నపాలు

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలులో భాగంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి  జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆయా మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. వచ్చిన అర్జీలను పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మెదక్ జిల్లాలో..

జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా కలెక్టర్ రాహుల్ రాజ్ చిలప్ చెడ్ మండలం పైలట్​ప్రాజెక్ట్​గా ఎంపిక చేశారు. ఈ మండలంలో 16 రెవెన్యూ  గ్రామాలు ఉండగా ఈ నెల 5 నుంచి 14 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆరు రోజులపాటు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అన్ని గ్రామాల్లో కలిపి 953 అర్జీలు వచ్చాయి. వాటిలో ఎక్కువగా సాదాబైనామా, మిస్సింగ్ సర్వే నెంబర్, ఎక్స్​టెన్షన్ కలెక్షన్ పై దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

గ్రామాల వారీగా చూస్తే రహీంగూడలో 34, దాసుగూడలో 9,  లింగరాజ్ గూడలో 20, బండపోతుగల్ లో 48, అజ్జమర్రిలో 62, ఫైజాబాద్ లో 46, శేరి ఫైజాబాద్ లో 11, గంగారంలో 42, చండూర్ లో 73, చిట్కుల్ లో 65, గౌతాపూర్ లో 255, సోమక్కపేట్ లో134, మంగళ్ పల్లిలో 7, జగ్గంపేటలో 40, చిలప్ చెడ్ లో 89 అర్జీలు వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా  పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. 

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో అక్కన్నపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈనెల 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వివిధ భూ సమస్యలపై 1,575 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా గవర్నమెంట్ ల్యాండ్స్ కు పట్టాలు ఇవ్వాలని, సాదాబైనామాల ద్వారా కొన్న భూములకు పట్టాలు ఇవ్వాలని, పట్టా నంబర్ ఒక దగ్గర ఉంటే భూమి వేరొక్క దగ్గర ఉండడం వంటి సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. అలాగే సీలింగ్ భూములను నిషేధ జాబితాల నుంచి తొలగించాలని పలువురు దరఖాస్తు చేసుకున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటివరకు 18 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు 1,274 అప్లికేషన్స్ వచ్చాయి. గ్రామాల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలిస్తే తొగరపల్లిలో125, అలియాబాద్ 35, గారకుర్తి 31, గిర్మాపూర్ 10, గోపులారం 51, హరిదాస్ పూర్ 45, తేర్పోల్ 105, మాచేపల్లి 22, గడిమల్కాపూర్ 14, గొల్లపల్లి 55, మునిదేవునిపల్లి 143, గుంతపల్లి 38, సీహెచ్ కోనాపూర్ 68, గంగారం 86, మనసాన్ పల్లి 61, మొహమ్మదాపూర్ 183, సైదాపూర్ 148, మారేపల్లి గ్రామంలో 54 అప్లికేషన్లను అధికారులు స్వీకరించారు. 

ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే?

మూడు జిల్లాల్లో ఎక్కువగా సాదాబైనామాల ద్వారా కొన్న భూములకు పట్టాలు ఇవ్వాలని, పట్టా నంబర్లు ఒక దగ్గర మోక మరో దగ్గర ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని, సీలింగ్ భూములను నిషేధిత  జాబితాల నుంచి తొలగించాలని దరఖాస్తు పెట్టుకున్నారు.