బుమ్రుక్నుదౌలా ట్యాంక్‌‌లో మట్టిని తొలగించాలి..పిటిషనర్‌‌కు హైకోర్టు ఆదేశం

బుమ్రుక్నుదౌలా ట్యాంక్‌‌లో మట్టిని తొలగించాలి..పిటిషనర్‌‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌ మండలం బుమ్రుక్నుదౌలా ట్యాంక్‌‌ ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో ఉన్న మట్టి, ఇతర సామగ్రిని తొలగించాలని పిటిషనర్‌‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ పిటిషనర్‌‌ తొలగించకపోతే వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హైడ్రా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌ మండలంలో సర్వే నెం.42లో 3.03 ఎకరాలు, సర్వే నెం.50/1లో 9.24 ఎకరాలను కొనుగోలు చేశానని, ఇందులో జోక్యం చేసుకోకుండా హైడ్రాతో సహా అధికారులను ఆదేశించాలని మహమ్మద్‌‌ ఇబ్రహీం హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ విచారించారు. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మరో ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదుతో అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, దీనిపై సివిల్‌‌ కోర్టు ఆదేశాలున్నాయని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి చెరువులో వేసిన మట్టిని పిటిషనర్‌‌ సొంత ఖర్చుతో తొలగించాలని ఆదేశించారు. అదేవిధంగా పిటిషనర్‌‌ సమర్పించిన వినతి పత్రాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైడ్రాను ఆదేశిస్తూ పిటిషన్‌‌పై విచారణను మూసివేశారు.