
- లింగంపేట మండలంలో ‘భూభారతి’ కింద 4,225 అప్లికేషన్లు
- అత్యధికంగా పాస్‌బుక్‌లలో పేర్లు, భూ విస్తీర్ణం తప్పుల సవరణ
కామారెడ్డి, వెలుగు : భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సర్కార్ ‘భూభారతి’ని తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట మండలం ఎంపికైంది. గత నెలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో మండలవ్యాప్తంగా 4225 అప్లికేషన్లు వచ్చాయి. పాస్‌బుక్‌లలో తప్పుల సవరణ, కొత్త పాస్ బుక్‌లు జారీ, సర్వే నంబర్ల మిస్సింగ్, భూ విస్తీర్ణంలో తేడాలు, అసైన్డ్, ఫారెస్ట్, రెవెన్యూ భూముల సమస్యపై అధికంగా దరఖాస్తులు వచ్చాయి.
క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా పాస్‌బుక్స్‌కు 325 , పాస్‌బుక్స్‌లో మార్పులు, చేర్పులకు సంబంధించి 283, అసైన్డ్పట్టాల్లో వారసత్వ పట్టాలు జారీ, అర్హులై ఉండి అసైన్డ్భూములు కొన్న వారికి పట్టాలు ఇచ్చేందుకు 192, అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు కొత్త పాస్‌బుక్స్ జారీకి 74, ఫారెస్ట్సరిహద్దు, పట్టాలు ఉండి ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న వారు 35, సాదాబైనామాలు45, ఇతర సమస్యలు 19 దరఖాస్తులకు ఆమోదం లభించింది. అప్రూవల్ అయిన అప్లికేషన్లను ప్రభుత్వానికి నివేదించారు. అర్హులైన వారి అనైన్డ్భూముల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ‘భూభారతి’ దరఖాస్తులను పరిశీలించేందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 9 టీమ్స్ ఏర్పాటు చేసి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
అడిషనల్ కలెక్టర్ ( రెవెన్యూ) వి.విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో, తహసీల్దార్లు టీమ్స్‌కు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. అధికారులతో పాటు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్ రెగ్యులర్‌గా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. 17 రోజుల్లో 94 శాతం అప్లికేషన్ల పరిశీలన కంప్లీట్ అయ్యింది. 4,225 అప్లికేషన్లలో 3,981 పరిశీలించగా, 973 దరఖాస్తులకు ఆమోదం లభించింది. పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే ఎన్ని అప్లికేషన్లు రిజెక్ట్అనేది స్పష్టత రానుంది.
అసైన్డ్, ఫారెస్ట్ సమస్యలపై..
లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో అసైన్డ్, ఫారెస్ట్, రెవెన్యూ భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. 2017 డిసెంబర్ 31కి ముందు రూల్స్ ప్రకారం అసైన్డ్ భూమి కొనుగోలు చేసి, అర్హులై ఉండి, సాగు చేస్తున్నవారికి హక్కులు కల్పించే అంశంపై ప్రభుత్వానికి నివేదించారు. పాస్‌బుక్స్ లేకుంటే కొత్త పాస్‌బుక్స్ ఇచ్చే వీలుంది. అసైన్డ్భూమి పట్టా ఉన్న వ్యక్తులు చనిపోతే వారి కుటుంబీకులకు హక్కు కల్పిస్తూ పాస్‌బుక్స్ అందజేయనున్నారు. ఫారెస్టు , రెవెన్యూ సరిహద్దు సమస్యలున్న భూములను ఫారెస్టు, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో అప్లికేషన్ల పరిశీలన
‘భూభారతి’లో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన అప్లికేషన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాం. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి 11రెవెన్యూ గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశాం. మిగతా గ్రామాల్లో రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తాం. అసైన్డ్‌భూముల కు సంబంధించి అర్హులకు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదించాం. అప్లికేషన్లలో ఎన్ని రిజెక్ట్అయ్యాయనేది పూర్తి స్థాయి పరిశీలన తర్వాత తెలుస్తుంది. కామారెడ్డి కలెక్టర్ఆశిష్ సంగ్వాన్